
జమ్మూ: శ్రీనగర్‌లో 1990 జనవరి 25వ తేదీన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) సిబ్బందిపై కాల్పులు జరిపింది జేకేఎల్‌ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ అని ప్రత్యక్ష సాక్షి ధ్రువీకరించారు. ఆ రోజు ఘటన జరిగిన తీరును గురువారం ఐఏఎఫ్ మాజీ కార్పొరల్ రాజ్వర్ ఉమేశ్వర్ సింగ్ ప్రత్యేక సీబీఐ కోర్టుకు చెప్పారు. శ్రీనగర్ వైమానిక కేంద్రానికి వెళ్లేందుకు ఐఏఎఫ్ సిబ్బంది 1990 జనవరి 25వ తేదీ ఉదయం రావల్‌పొరాలో వాహనం కోసం ఎదురు చూస్తున్నారు.
అదే సమయంలో యాసిన్ మాలిక్‌తోపాటు కొందరు ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్నారు. యాసిన్ మాలిక్ తన దుస్తుల్లో నుంచి తుపాకీని బయటకు తీసి, యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో స్క్వాడ్రన్ లీడర్ రవి ఖన్నా సహా నలుగురు నేలకొరగ్గా మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఉమేశ్వర్ సింగ్ ఒకరు.
తీహార్ జైలులో ఉన్న యాసిన్ మాలిక్ గురువారం జరిగిన కోర్టు విచారణకు వర్చువల్‌గా పాల్గొన్నాడు. ప్రత్యక్ష సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చని కోర్టు ఇచ్చిన అవకాశాన్ని యాసిన్ మాలిక్ తిరస్కరించాడు. తనను కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరచాలని కోరాడు. ఈ కేసులో మాలిక్, మరో అయిదుగురిపై 1990 ఆగస్ట్ 31వ తేదీన జమ్మూలోని టాడా కోర్టులో చార్జిషీటు దాఖలైంది. 1989లో అప్పటి కేంద్ర మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబియా కిడ్నాప్, నేవీ అధికారులపై కాల్పుల కేసులు యాసిన్ మాలిక్‌పై ఉన్నాయి.