
మందుల మాఫియాకు అడ్డుకట్ట
3వేల జన్ ఔషధి కేంద్రాలను తెరవనున్న కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో రెచ్చిపోతున్న మెడిసిన్ మాఫియాకు అడ్డుకట్టవేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. మార్చి చివరి కల్లా దేశవ్యాప్తంగా 3వేల జన్ ఔషధి కేంద్రాలను తెరిచి తక్కువధరకే నాణ్యమైన మందులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని రసాయన, ఎరువుల మంత్రి అనంత్ కుమార్ శుక్రవారం తెలిపారు. జాతీయ యువ సహకార సొసైటీ (ఎన్ వైసీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ‘దురదృష్టవశాత్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో మెడిసిన్ మాఫియా ఆధిపత్యం నడుస్తోంది.
ఇష్టమొచ్చిన రేట్లకు మందులను విక్రయిస్తూ.. సామాన్యుణ్ని ఇబ్బందులు పెడుతున్నారు. జెనరిక్ మందులతో పోలిస్తే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు బ్రాండెడ్ (పేటెంట్ హక్కులున్న) మందులకు అత్యధికంగా డబ్బులు తీసుకుంటున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలి’ అని తెలిపారు. జెనరిక్ దుకాణాల్లో అమ్మే మందుల నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో సరిపోతుందని, ధర కూడా చాలా తక్కువగా ఉంటుందన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో మెడిసిన్ మాఫియా నిశ్శబ్దంగా ఉండదన్నారు.