ప్రయోగాల ప్రజ్ఞాశాలి పుట్టిన రోజు | Today Kamal Haasan birthday | Sakshi
Sakshi News home page

ప్రయోగాల ప్రజ్ఞాశాలి పుట్టిన రోజు

Published Fri, Nov 7 2014 4:14 AM | Last Updated on Mon, Oct 22 2018 7:26 PM

ప్రయోగాల ప్రజ్ఞాశాలి పుట్టిన రోజు - Sakshi

ప్రయోగాల ప్రజ్ఞాశాలి పుట్టిన రోజు

పుట్టినరోజు అందరికీ పండుగే. మరి పుట్టింది ఎందుకు అని తెలిసేది ఎందరికి అని ప్రశ్నించాడో మహాకవి. అలా పుట్టుకను సార్థకం చేసుకున్న మహా నటుల్లో కమలహాసన్ ఒకరు. కమలహాసన్ జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే అసలు ఈయన పుట్టింది నటన కోసమేనా? అలాంటి నటనకు గౌరవాన్ని ఆపాదించడానికేనా? నటన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికేనా? అని అనిపిస్తుంది.

ఎందుకంటే నాలుగేళ్ల పసి వయసులోనే నటననే కళామతల్లి ఒడి చేరిన కమల్ తొలిచిత్రంతోనే బాల నటుడిగా (కలత్తూర్ కన్నమ్మ) రాష్ట్రపతి అవార్డును, బంగారు పతకాన్ని అందుకున్నారు. కళలకు సంబంధం లేని కుటుంబంలో పుట్టిన కమల్ నేడు భారతదేశం గర్వించే నటుడిగా ప్రపంచం గౌరవించే కళాకారుడిగా ఎదిగారంటే ఆయన కృషి, శ్రమ, సాధన ఎంత ఉంటుందో ఊహించడం సాధ్యం కాదు. 1954 నవంబర్ 7న రామనాథపురం జిల్లా పరమకుడిలో జన్మించిన కమలహాసన్ తండ్రి డి.శ్రీనివాసన్ న్యాయవాది.

ఆయన సోదరులు చారుహాసన్, చంద్రహాసన్ న్యాయవాదులే. సోదరి నళిని క్లాసికల్ డాన్సర్. నాలుగేళ్ల వయసులోనే కలత్తూర్ కన్నమ్మ చిత్రం ద్వారా బాల నటుడిగా రంగ ప్రవేశం చేసిన కమలహాసన్ 21 ఏళ్ల లోనే హీరోగా అవతారమెత్తారు. కమలహాసన్ హీరోగా నటించిన తొలి చిత్రం అపూర్వ రాగంగళ్. జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ నట సవ్యసాచిని ఫిలింఫేర్ అవార్డు వరిచింది.
    
ప్రయోగాల ప్రభంజనం

కమలహాసన్ అంటేనే ప్రయోగాలు పలకరిస్తాయి. మొదట్లో పక్కా క మర్షియల్ చిత్రాల్లో స్టార్ ఇమేజ్‌ను సాంతం చేసుకున్న ఈ నవరస నాయకుడు ఆ తరువాత కొంగొత్త ప్రయోగాలకు నాంది పలికారు. అమావాస్య చంద్రుడు చిత్రంలో మూగవాడిగా, అసలు మాటలే లేని చిత్రం పుష్పక విమానంలోను తన నట చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఇక విచిత్ర సోదరులు చిత్రంలో మరుగుజ్జు వాడిగా నటించి ప్రపంచ సిని మానే తిరిగి చూసేలా చేశారు. దశావతారంలో ఏకంగా పది వైవిధ్యభరిత పాత్రలు పోషించి చరిత్ర సృష్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ ప్రతి చిత్రం ఒక ప్రయోగమే. నాయకన్, మహానది, గుణ, మైఖేల్‌మదన్‌కామరాజ్ ఇలా తాజా చిత్రం విశ్వరూపం వరకు అద్భుత ప్రయోగాలే.
    
బహుభాషా నట చక్రవర్తి
కమల్ తన నట తృష్ణను ఒక్క తమిళ భాషలోనే తీర్చుకోదలచుకోలేదు. తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఏ భాషలో నటించినా ఆ భాషా నటుడి ముద్ర వేసుకున్నారు. అన్ని భాషల్లోనూ కమల్ చిత్రాలు గొప్ప కళా ఖండాలుగా వాసికెక్కడం విశేషం.
    
బహుముఖ ప్రజ్ఞాశాలి
కమలహాసన్ ఒక నటనలోనే తన ప్రజ్ఞను సరిపెట్టుకోలేదు. కథకుడిగా, గీత రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, గాయకుడిగా, నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన శైలిని చాటుకున్నారు.
    
అవార్డులకు అలంకారం

కమల్ బాల నటుడిగా తొలి చిత్రంలోనే అవార్డును కొల్లగొట్టడం ఆరంభించారు. నాలుగు జాతీయ అవార్డులతో పాటు, పలు ప్రాంతీయ అవార్డులను, 19 ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నప్పటి వరకు కమల్ నటనా ప్రతిభకు గాను కేంద్ర ప్రభుత్వం 1990లో పద్మశ్రీ అవార్డును, 2014లో పద్మభూషణ్ అవార్డుతోను ఘనంగా సత్కరించింది.
    
సామాజిక సేవలోనూ..

కమలహాసన్ నాస్తికుడంటారు. ఆయనకు సామాజిక స్పృహ ఎక్కువ. కమలహాసన్ నర్పని ఇయక్కం (అభిమాన సంఘం) పేరుతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా చెన్నై మాదంబాక్కం సమీపంలోని సరస్సులను శుద్ధి చేసే బృహత్తర కార్యక్రమాన్ని తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టనున్నారు. నేడు 60వ వసంతంలోకి అడుగిడుతున్న ఈ సకలకళా వల్లభుడికి శుభాకాంక్షలు చెబుతాం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement