
నేడు తమిళనాడు, కేరళ ఎన్నికలు
పుదుచ్చేరిలో కూడా...
♦ తమిళనాట బహుముఖ పోరు, లక్షమందితో భద్రత
♦ కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ల మధ్య హోరాహోరీ
చెన్నై/తిరువనంతపురం: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో నేడు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తమిళనాడులో 233 స్థానాలకు, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ 19న జరుగుతుంది. తమిళనాట వరుసగా రెండోసారి పీఠం దక్కించుకోవాలని జయలలిత, అధికార మార్పిడి ఆశలతో కరుణానిధిలు ఉచిత పథకాలతో ఊదరగొట్టారు. వారిద్దరితో పాటు డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే చీఫ్ అన్బుమణి రాందాస్‌లు కూడా సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. ఆర్కే నగర్ నుంచి జయలలిత, తిరువరూర్ నుంచి కరుణానిధి బరిలో ఉన్నారు.
అన్నాడీఎంకే, డీఎంకే ఆధిపత్యానికి చెక్ చెప్పాలంటూ డీఎండీకే-పీడబ్ల్యూఎఫ్-టీఎంసీల కూటమి విస్తృతంగా ప్రచారం చేసింది. 1967 నుంచి తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే అధికార మార్పిడి జరుగుతోంది. ఆ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేసేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిం చింది. కాగా, ఎన్నికల కోసం దాదాపు లక్ష మందికి పైగా పోలీసులు, పారామిలటరీ సిబ్బంది వినియోగిస్తున్నారు. మొత్తం 65వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. అరవకురిచి, తంజావూరు స్థానాల్లో అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై అక్కడ ఎన్నికలను ఈసీ మే 23కు వాయిదా వేసింది. మే 25న కౌంటింగ్ నిర్వహించనుంది.
యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సీపీఎం నేతృత్వంలో ఎల్డీఎఫ్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎలాగైనా బోణీ చేసేందుకు బీజేపీ ఈ సారి శ్రమించింది. అందుకోసం ఎజావా వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్ ధర్మ జనసేనతో పొత్తుపెట్టుకుంది. పార్టీ తరపున ప్రధాని మోదీ మూడు సార్లు ప్రచారం చేశారు. కేరళలో మొత్తం 2.61 కోట్ల మంది ఓటేయనుండగా, 140 స్థానాలకు 1,203 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 109 మంది మహిళలు పోటీపడుతున్నారు. ప్రచారం చివరి దశలో జాతీయ నేతలు కేరళను చుట్టేశారు. మోదీ కేరళను సోమాలియాతో పోల్చడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ తరపున అధినేత్రి సోనియా, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్.. కమ్యూనిస్టుల తరపున సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రచారం చేశారు. సోలార్ కుంభకోణం, దళిత విద్యార్థిని అత్యాచారం, హత్య, లిబియాలో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకురావడం వంటి అంశాల్ని పార్టీలు ప్రధానంగా ప్రచారం చేశాయి.
ఈసీ నోటీసుకు స్పందించిన జయ
ఎన్నికల సంఘం పంపిన నోటీసులకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆదివారం సమాధానం పంపగా, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మాత్రం మరికొంత సమయం కోరారు. కాగా, సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించడంపై డీఎంకే అధ్యక్షుడు కరుణానిధికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.