హైదరాబాద్ క్రైం బ్రాంచ్ అధికారి వేధింపుల వల్లే చనిపోతున్నాం
బెంగళూరులో సూసైడ్‌నోట్ రాసి ఓ కుటుంబం ఆత్మహత్య
బెంగళూరు, న్యూస్‌లైన్: హైదరాబాద్ సిటీ క్రైం బ్రాంచ్ పోలీసు అధికారి ‘రెడ్డి’ వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోట్ రాసి బెంగళూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయినవారిలో భార్యాభర్తలు, వారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం.. అమెరికాలో ఉండే కౌశిక్ శర్మ మూడేళ్ల క్రితం బెంగళూరు వకీల్ గార్డెన్‌లో భవంతిని నిర్మించుకుని అప్పటినుంచి అందులో భార్య శ్రీలత, కుమారుడు కౌస్తుభ, కుమార్తె శ్రీరక్షలతో నివసిస్తున్నారు. నగరంలోనే ఉండే తన అన్న కుమార్తె సుమేఘకు గురువారం ఫోన్ చేసిన కౌశిక్.. శుక్రవారం ఉదయం తమ ఇంటికి తప్పకుండా రావాలని పిలిచారు. ఆమె శుక్రవారం అక్కడికి వెళ్లి చూడగా, నలుగురూ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించింది.
ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన దంపతులు తర్వాత ఉరేసుకున్నారు. ఒక బ్యాగులో రూ.10 లక్షలు, మరో బ్యాగులో కిలోన్నర బంగారు నగలు కూడా పెట్టి ఉంచిన విషయాన్ని సుమేఘ గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి కౌశిక్ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో '‘హైదరాబాద్ సిటీ క్రైం పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న రెడ్డి అనే అధికారి మా ఆస్తులు, నగదు, నగలు స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. నిత్యం వేధిస్తున్నాడు. ఆ వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నాం..’ అని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటిలో గొడలపై సైతం ‘ఏపీ పోలీస్ రెడ్డి, సీసీఎస్, అవర్ మనీ, గోల్డ్, సైట్’ అని రక్తంతో రాసినట్లు గుర్తిం చారు.
తమ ఆస్తులతోపాటు నగలు, నగదు మొత్తం సుమేఘకు ఇవ్వాలని కౌశిక్ వీలునామా కూడా రాశారని పోలీసులు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉన్నందున నిందితుడు ‘రెడ్డి’ పూర్తి పేరును చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. అయితే నిందితుడికి కూడా వకీల్ గార్డెన్‌లో స్థలం ఉందని, తరచూ ఆ స్థలాన్ని చూసుకోవడానికి వచ్చిపోతూ.. కౌశిక్ పూర్తి వివరాలు తెలుసుకున్న ఆయన వారి ఆస్తిని కొట్టేసేందుకు కుట్ర పన్నారని సమాచారం.