న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి, జమ్మూకశ్మీర్ రాజకీయ నాయకుడు షా ఫైజల్ బక్రీద్ పండుగను ఉద్దేశించి ట్విటర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి అవమానానికి ప్రతీకారం తీర్చుకొని బదులు ఇచ్చేవరకు ఈద్ జరుపుకోబోనని ఆయన హెచ్చరించారు. ‘ఈద్ అనేది లేదు. తమ భూభాగాన్ని లాక్కోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న కశ్మీరీలు ఆవేదన చెందుతున్నారు. 1947 నుంచి దొంగలించి లాక్కున్నదంతా వెనక్కి తీసుకునే వరకు ఈద్ జరుపుకునే ప్రసక్తే లేదు. చివరి అవమానానికీ ప్రతీకారం తీర్చుకునే వరకు ఈద్ జరుపుకోబోను’అని ఆయన ట్వీట్ చేశారు. 2009లో సివిల్స్‌లో టాప్ ర్యాంక్ సాధించిన తొలి కశ్మీరీగా రికార్డు నెలకొల్పిన షా ఫైజల్.. గత జనవరిలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. రాజకీయ పార్టీని స్థాపించారు.
జమ్మూకశ్మీర్‌లో ప్రశాంతంగా బక్రీద్ పర్వదిన సాగుతున్న సమయంలో రెచ్చగొట్టే రీతిలో ట్వీట్ చేసిన ఫైజల్ తీరుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ మాజీ అధికారి అయి ఉండి ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారని, కేవలం ముస్లింలను మాత్రమే కశ్మీరీలుగా ఈ రాజకీయ నాయకుడు చూస్తున్నట్టు కనిపిస్తోంది, ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఓ వ్యక్తి ఇలా ప్రతీకార భాష మాట్లాడటం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment