శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. కొన్ని గంటల వ్యవధిలోని వేర్వేరు ప్రాంతాలలో మిలిటెంట్లు కాల్పులకు పాల్పడి ఒక ఉన్నతా అధికారి సహా ఇద్దరు పోలీసులను పొట్టనబెట్టుకున్నారు. అనంత్ నాగ్ జిల్లాలో శనివారం ఉదయం పోలీస్ పార్టీపై మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే జనరల్ బస్టాండ్ సమీపంలో ఉన్న పోలీసులపై ఒక్కసారిగా మిలిటెంట్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు పోలీసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బషీర్ అహ్మద్, కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్గా గుర్తించారు.
కాగా 24 గంటల్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడటం ఇది రెండోసారి. శుక్రవారం సాయంత్రం బీఎస్ఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో తొమ్మిదిమంది గాయపడిన విషయం తెలిసిందే. మరోవైపు అనంత్ నాగ్ జిల్లాలో జూన్ 22న ఉప ఎన్నిక జరగనుంది. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా మఫ్తీ తండ్రి మఫ్తీ మహ్మద్ సయిద్ అనారోగ్యంతో ఈ ఏడాది జనవరిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది.