దాడి జరిగిన సంజువాన్ సైనిక శిబిరం వద్ద అప్రమత్తమైన జవాన్లు
సంజువాన్: జమ్మూ కశ్మీర్‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూ నగరం శివారు ప్రాంతం సంజువాన్‌లో ఉన్న ఆర్మీ శిబిరంపై శనివారం తెల్లవారుజామున దాడికి తెగబడడంతో ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించగా.. 9 మంది గాయపడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరడంతో పాటు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ ఆర్మీ కుటుంబాలు నివసిస్తున్న వసతి గృహ సముదాయంపై దాడికి యత్నించారు. వెంటనే తేరుకున్న ఆర్మీ సిబ్బంది ఉగ్రదాడిని దీటుగా తిప్పికొట్టారు.
ఉగ్రవాదుల్ని ఎటూ కదలకుండా నిరోధించిన భద్రతా బలగాలు.. శిబిరం నుంచి అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించిన అనంతరం సాయంత్రం సమయంలో ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఆర్మీ ఆపరేషన్ అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగడంతో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులంతా హతమయ్యారా? లేదా? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఉగ్రదాడిలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన సుబేదార్ మదన్‌లాల్ చౌదరి, హవిల్దార్ హబీముల్లా ఖురేషీ ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ అధికారి వెల్లడించారు.
ఐదుగురు మహిళలు, చిన్నారులు సహా తొమ్మిది మంది గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంద న్నారు. గాయపడ్డవారిలో హవిల్దార్ అబ్దుల్ హమీద్, లాన్స్ నాయక్ బహదూర్ సింగ్‌తో పాటు స్కూలు సెలవుల్లో తండ్రిని చూసేందుకు వచ్చిన సుబేదార్ మదన్‌లాల్ కుమార్తె కూడా ఉన్నారు. జమ్మూకు చెందిన ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ దాడి వివరాల్ని వెల్లడిస్తూ ‘శనివారం తెల్లవారుజామున శిబిరానికి వెనుకవైపు కాపలాగా ఉన్న సెంట్రీ బంకర్‌పై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. అనంతరం ఆర్మీ కుటుంబాలు నివసిస్తున్న వసతి గృహ సముదాయంలోకి చొరబడ్డారు.
ఎదురుకాల్పుల్లో ముగ్గు రు ఉగ్రవాదుల్ని ఆర్మీ హతమార్చింది. ఉగ్రవాదుల వద్ద దొరికిన వస్తువుల మేరకు వారిని జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన వారుగా గుర్తించాం’ అని తెలిపారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే మెరుపు బృందాలు రంగ ప్రవేశం చేసి ఇళ్లలో దాక్కున్న ఉగ్రవాదుల్ని ఎటూ కదలకుండా నిరోధించాయని, సైనిక కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది మృతి చెందారని ఆయన వెల్లడించారు. గతంలో 2016 నవంబర్‌లో నగ్రోటాలోని ఆర్మీ శిబిరంపై ఆత్మాహుతి బృందం దాడి చేయడంతో ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
ఆచితూచి ఆపరేషన్
గృహ సముదాయంలో మహిళలు, చిన్నారులు ఉండడంతో ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే ఆపరేషన్‌ను ఆర్మీ జాగ్రత్తగా కొనసాగించింది. ఉగ్రవాదులు ఎక్కడ నక్కారో తెలుసుకునేందుకు ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్‌లను వాడింది. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్‌లో ప్రత్యేక బలగాలు వెనుకవైపు నుంచి శిబిరంలోకి చేరుకుని ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. శిబిరం సరిహద్దు గోడ వెలుపల సీఆర్‌పీఎఫ్, పోలీసుల్ని మోహరించారు. అలాగే ఐదు కిలోమీటర్ల పరిధిలోని స్కూళ్లను అధికారులు మూసివేశారు. జమ్మూలో హై అలర్ట్ ప్రకటించడంతో పాటు భదత్రను కట్టుదిట్టం చేశారు. జమ్మూ ఐజీ ఎస్‌డీ సింగ్ ఉగ్రదాడిపై మాట్లాడుతూ.. ‘దాడి గురించి తెలియగానే ఆర్మీ ప్రత్యేక బలగాలు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌ఓజీ) సిబ్బంది చేరుకుని.. శిబిరాన్ని చుట్టుముట్టాయి’ అని తెలిపారు. ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడ్డ మేజర్‌ను హెలికాప్టర్‌లో ఉధమ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
మృతి చెందిన ఆర్మీ సిబ్బంది: సుబేదార్ మదన్‌లాల్ చౌదరి, హవిల్దార్ హబీముల్లా ఖురేషీ
Comments
Please login to add a commentAdd a comment