ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యులు అదృశ్యం | Two Telugu doctors disappear in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యులు అదృశ్యం

Published Tue, Dec 31 2019 2:29 AM | Last Updated on Tue, Dec 31 2019 2:29 AM

Two Telugu doctors disappear in Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇద్దరు తెలుగు వైద్యులు ఢిల్లీలో అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్‌ హిమబిందు, ఆమె స్నేహితుడు, అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన డాక్టర్‌ దిలీప్‌ సత్య డిసెంబర్‌ 25న కనిపించకుండా పోయారు. హిమబిందు భర్త డాక్టర్‌ శ్రీధర్‌ అదేరోజు ఢిల్లీలోని హాజ్‌కాస్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 6 రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.  

శ్రీధర్, దిలీప్‌ సత్య, హిమబిందు.. ముగ్గురూ వైద్యులే. ఆత్మీయ మిత్రులే. వీరంతా 2007లో ఎంబీబీఎస్‌లో క్లాస్‌మేట్స్‌. హిమబిందు, శ్రీధర్‌ భార్యా భర్తలు. శ్రీధర్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో పిల్లల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నాడు. హిమబిందు ఎయిమ్స్‌లో పీజీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఒక ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇక దిలీప్‌ సత్య చండీగఢ్‌లో పీజీ చేశాడు. అక్కడే సీనియర్‌ రెసిడెన్సీగా చేసి, 2 నెలల క్రితం మానేశాడు. ఉన్నత చదువులకు సన్నద్ధమవుతున్నాడు. డీఎం పరీక్ష రాశాడు. సోమవారం రాత్రి శ్రీధర్‌ ఏపీ భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడాడు. ‘‘జిప్‌మర్‌ కౌన్సెలింగ్‌ కోసం దిలీప్‌ చెన్నై వెళ్లాడు. చెన్నై నుంచి 25వ తేదీన ఉదయం 7 గంటలకు ఢిల్లీ వచ్చాడు. మధ్యాహ్నం 2.30 గంటలకు చండీగఢ్‌ వెళ్లే ట్రైన్‌ ఉందని, ఇంటికొస్తానని నాకు ఫోన్‌చేసి చెప్పాడు. నేను ఉదయం 7.30 గంటలకే డ్యూటీకి వెళ్లాను.

ఢిల్లీ వచ్చిన దిలీప్‌ ఉదయం 8.45–9.00 గంటల మధ్య మా ఇంటికి చేరినట్టు ఫోన్‌ చేశాడు. క్రిస్మస్‌ సెలవు కావడంతో నా భార్య ఇంట్లోనే ఉంది. వారిద్దరూ అల్పాహారం తీసుకున్నారు. ఉదయం 11.20 గంటలకు నా భార్య ఫోన్‌ చేసింది. చర్చికి వెళుతున్నామంది. దిలీప్‌తో కలిసి వెళ్తానని, అతడు అటునుంచి అటే రైల్వే స్టేషన్‌కు వెళతాడని చెప్పింది. నా డ్యూటీ అయ్యాక మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్‌ చేస్తే నా భార్య ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. వెంటనే దిలీప్‌కు ఫోన్‌ చేశాను. అతడి ఫోన్‌  స్విచ్ఛాప్‌ వచ్చింది. సాయంత్రం వరకూ చాలాసార్లు చేశా. స్విచ్ఛాప్‌ అనే సమాధానం వచ్చింది. సాయం త్రం 6 గంటలకు దిలీప్‌ భార్య దివ్యకు ఫోన్‌ చేశా. ఆమె చండీగఢ్‌లోనే జాబ్‌ చేస్తోంది. దివ్య ఫోన్‌ చేసి నా స్విచ్ఛాప్‌ అని వస్తున్నట్లు చెప్పింది. దిలీప్‌ ఉద యం ఫోన్‌ చేసి చర్చికి వెళుతున్నట్టు చెప్పాడంది. దిలీప్‌ చండీగఢ్‌కు చేరుకోకపోవడంతో దివ్య అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చేసింది’’అని శ్రీధర్‌ తెలిపాడు.   

ఒక్క క్లూ దొరకలేదు
‘‘దిలీప్, హిమబిందు అదృశ్యంపై ఇప్పటిదాకా ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఎక్కడికెళ్లారో తెలియడం లేదు. వాళ్ల బ్యాంకు స్టేట్‌మెంట్‌ చూశాం. డిసెంబర్‌ 21 తర్వాత వాళ్లు ఏ కార్డు వాడలేదు. చేతి లో 3, 4 వేల కంటే నగదు లేదు. బిందు తో నా పెళ్లి దిలీపే జరిపించాడు. మాది లవ్‌ మ్యారేజ్‌. నేను లేనప్పుడు నా భార్యను సురక్షితంగా పంపించగలిగేది దిలీప్‌తోనే. బయటికి ఎక్కడికైనా వెళ్లాలన్నా దిలీప్‌తోనే పంపిస్తా. దిలీప్‌ నా భార్యకు సొంత అన్నలాంటివాడు. దిలీప్‌ తల్లిదండ్రులు నా భార్యను కూతురిలా చూసుకుంటారు. దయచేసి ఈ ఘటనను మీడియా తప్పుగా చూపించొద్దు’’అని శ్రీధర్‌ వేడుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement