Telugu doctors
-
తెలుగు వైద్యుల ఆచుకీ లభ్యం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదృశ్యమైన ఇద్దరు తెలుగు వైద్యుల ఆచూకీ లభించింది. డిసెంబర్ 25వ తేదీన కనిపించకుండా పోయిన హిమబిందు, ఆమె స్నేహితుడు దిలీప్ సత్యలు సిక్కింలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారిని సురక్షితంగా ఢిల్లీకి తరలించారు. సోషల్ మీడియా సాయంతో పోలీసులు వీరిని వెతికి పట్టుకున్నారు. డిసెంబర్ 31వ తేదీన దిలీప్ సిక్కింలో ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆదృశ్యానికి గల కారణాలపై పోలీసులు వారిని విచారిస్తున్నారు. కాగా, శ్రీధర్, దిలీప్, హిమబిందు ముగ్గురు ఎంబీబీఎస్‌లో క్లాస్మేట్స్. అలాగే ఆత్మీయ మిత్రులు. శ్రీధర్ అతని భార్య హిమబిందు ప్రస్తుతం ఢిల్లీలో వైద్యులుగా పనిచేస్తున్నారు. మరోవైపు చండీగఢ్‌లో పీజీ చేసిన దిలీప్, అక్కడే సీనియర్ రెసిడెన్సీసిగా చేసి.. 2 నెలల క్రితం మానేశాడు. ప్రస్తుతం ఉన్నత చదువులకు సన్నద్దమవుతున్నాడు. అయితే 25వ తేదీన మధ్యాహ్నం బయటకు వెళ్లిన హిమబిందు, దిలీప్‌లు కనిపించకుండా పోయారు. ఆ తర్వాత వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. దీంతో శ్రీధర్ ఢిల్లీ హాజ్‌కాస్ పోలీసులను ఆశ్రయించాడు. చంఢీగడ్‌లో ఉంటున్న దిలీప్ భార్య దివ్య.. భర్త ఆచూకీ తెలియకపోవడంతో అక్కడి నుంచి ఢిల్లీ చేరుకుంది. శ్రీధర్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు వారి గురించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. రెండు ఫోన్లు సిచ్ఛాఫ్ రావడం.. వారిద్దరు రోడ్డుపై నడుస్తున్న ఓ వీడియో మాత్రమే లభించడంతో కేసు దర్యాప్తు కష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఎన్నో అనుమానాలు తలెత్తాయి. చివరకు సోషల్ మీడియా సాయంతో పోలీసులు వారి ఆచూకీని గుర్తించారు. చదవండి : ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యులు అదృశ్యం -
ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యులు అదృశ్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఇద్దరు తెలుగు వైద్యులు ఢిల్లీలో అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్ హిమబిందు, ఆమె స్నేహితుడు, అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన డాక్టర్ దిలీప్ సత్య డిసెంబర్ 25న కనిపించకుండా పోయారు. హిమబిందు భర్త డాక్టర్ శ్రీధర్ అదేరోజు ఢిల్లీలోని హాజ్‌కాస్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 6 రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. శ్రీధర్, దిలీప్ సత్య, హిమబిందు.. ముగ్గురూ వైద్యులే. ఆత్మీయ మిత్రులే. వీరంతా 2007లో ఎంబీబీఎస్‌లో క్లాస్మేట్స్. హిమబిందు, శ్రీధర్ భార్యా భర్తలు. శ్రీధర్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో పిల్లల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నాడు. హిమబిందు ఎయిమ్స్‌లో పీజీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఒక ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇక దిలీప్ సత్య చండీగఢ్‌లో పీజీ చేశాడు. అక్కడే సీనియర్ రెసిడెన్సీగా చేసి, 2 నెలల క్రితం మానేశాడు. ఉన్నత చదువులకు సన్నద్ధమవుతున్నాడు. డీఎం పరీక్ష రాశాడు. సోమవారం రాత్రి శ్రీధర్ ఏపీ భవన్ వద్ద మీడియాతో మాట్లాడాడు. ‘‘జిప్మర్ కౌన్సెలింగ్ కోసం దిలీప్ చెన్నై వెళ్లాడు. చెన్నై నుంచి 25వ తేదీన ఉదయం 7 గంటలకు ఢిల్లీ వచ్చాడు. మధ్యాహ్నం 2.30 గంటలకు చండీగఢ్ వెళ్లే ట్రైన్ ఉందని, ఇంటికొస్తానని నాకు ఫోన్‌చేసి చెప్పాడు. నేను ఉదయం 7.30 గంటలకే డ్యూటీకి వెళ్లాను. ఢిల్లీ వచ్చిన దిలీప్ ఉదయం 8.45–9.00 గంటల మధ్య మా ఇంటికి చేరినట్టు ఫోన్ చేశాడు. క్రిస్మస్ సెలవు కావడంతో నా భార్య ఇంట్లోనే ఉంది. వారిద్దరూ అల్పాహారం తీసుకున్నారు. ఉదయం 11.20 గంటలకు నా భార్య ఫోన్ చేసింది. చర్చికి వెళుతున్నామంది. దిలీప్‌తో కలిసి వెళ్తానని, అతడు అటునుంచి అటే రైల్వే స్టేషన్‌కు వెళతాడని చెప్పింది. నా డ్యూటీ అయ్యాక మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేస్తే నా భార్య ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. వెంటనే దిలీప్‌కు ఫోన్ చేశాను. అతడి ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. సాయంత్రం వరకూ చాలాసార్లు చేశా. స్విచ్ఛాప్ అనే సమాధానం వచ్చింది. సాయం త్రం 6 గంటలకు దిలీప్ భార్య దివ్యకు ఫోన్ చేశా. ఆమె చండీగఢ్‌లోనే జాబ్ చేస్తోంది. దివ్య ఫోన్ చేసి నా స్విచ్ఛాప్ అని వస్తున్నట్లు చెప్పింది. దిలీప్ ఉద యం ఫోన్ చేసి చర్చికి వెళుతున్నట్టు చెప్పాడంది. దిలీప్ చండీగఢ్‌కు చేరుకోకపోవడంతో దివ్య అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చేసింది’’అని శ్రీధర్ తెలిపాడు. ఒక్క క్లూ దొరకలేదు ‘‘దిలీప్, హిమబిందు అదృశ్యంపై ఇప్పటిదాకా ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఎక్కడికెళ్లారో తెలియడం లేదు. వాళ్ల బ్యాంకు స్టేట్మెంట్ చూశాం. డిసెంబర్ 21 తర్వాత వాళ్లు ఏ కార్డు వాడలేదు. చేతి లో 3, 4 వేల కంటే నగదు లేదు. బిందు తో నా పెళ్లి దిలీపే జరిపించాడు. మాది లవ్ మ్యారేజ్. నేను లేనప్పుడు నా భార్యను సురక్షితంగా పంపించగలిగేది దిలీప్‌తోనే. బయటికి ఎక్కడికైనా వెళ్లాలన్నా దిలీప్‌తోనే పంపిస్తా. దిలీప్ నా భార్యకు సొంత అన్నలాంటివాడు. దిలీప్ తల్లిదండ్రులు నా భార్యను కూతురిలా చూసుకుంటారు. దయచేసి ఈ ఘటనను మీడియా తప్పుగా చూపించొద్దు’’అని శ్రీధర్ వేడుకున్నాడు. -
ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యుల మిస్సింగ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో తెలుగు వైద్యుల అదృశ్యం మిస్టరీగా మారింది. ఈ నెల25న డాక్టర్ హిమబిందు(29), డాక్టర్ దిలీప్ సత్య(28) ఢిల్లీలో అదృశ్యమయ్యారు. కాగా హిమబిందు భర్త డా. శ్రీధర్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిలీప్, హిమబిందు, శ్రీధర్ ఈ ముగ్గురు కర్నూల్ మెడికల్ కళాశాలలో కలిసి చదువుకున్నారు. చండీగఢ్‌లో చిన్న పిల్లల వైద్యునిగా దిలీప్ పనిచేస్తున్నారు. ఈ నెల 24న పుదుచ్చేరిలోఇంటర్వ్యూకి వెళ్లి 25న తిరిగి వస్తుండగా ఢిల్లిలోని శ్రీధర్ దంపతుల ఇంట్లో ఆగారు. అనంతరం ఉదయం 11.30 నిమిషాల సమయంలో దిలీప్‌తో కలిసి చర్చికి వెళ్తున్నానని చెప్పి హిమబిందు, దిలీప్ బయటికి వెళ్లారు. కాసేపటి తరువాత ఇద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో బిందు భర్త శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఇద్దరి ఆచూకీ కనిపెట్టాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ , ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్లను అభ్యర్థించారు. -
డోబీలో తెలుగు డాక్టర్ ల ఉచిత వైద్యశిబిరం
భివండీ, న్యూస్‌లైన్: మధ్యప్రదేశ్ రాష్ట్రం డోబీ గ్రామంలో భివండీ ప్రాంతానికి చెందిన తెలుగు వైద్యులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మండలా జిల్లా నైనాపూర్ తాలూకా డోబీ గ్రామంలో బీద ఆదివాసీ ప్రజలు నివసిస్తున్నారు. కాగా, ఇక్కడ కొలువైన బసవరాజలింగేశ్వర స్వామి మందిర వార్షికోత్సవం ఇటీవల జరిగింది. దాన్ని పురస్కరించుకుని భివండీకి చెందిన వైద్యులు శ్రీపాల్ జైన్, మంచికట్ల వెంకటేశ్, ఆడెపు భగవాన్, క ళ్యాడపు భూమేశ్, ఎం.బి. రాజ్, జక్కని గణపతి, మెనగందుల సాయిబాబా తదితరులు వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హాజరైన రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.