
తీహార్ జైలులో సొరంగం.. ఖైదీల పరారీ
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత పటిష్ఠమైనదిగా పేరుపొందిన తీహార్ జైలు నుంచి ఇద్దరు విచారణ ఖైదీలు రహస్య సొరంగం తవ్వుకుని పరారయ్యారు. ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది. అయితే దీనిపై స్పందించేదుకు జైలు అధికారులు నిరాకరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు..
తీహార్ జైలులో అంర్భాగంగా ఉన్న ఏడో నంబర్ సబ్ జైలులోని ఓ గదిలో ఫైజన్, జావేద్ అనే విచారణ ఖైదీలు ఉన్నారు. చోరే కేసులో వారు విచారణ ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి అందరు ఖైదీలు అటెండెన్స్ కోసం హాలులోకి రాగా.. ఈ ఇద్దరు మాత్రం హాజరుకాలేదు. దీంతో అనుమానం వచ్చిన జైలు సిబ్బంది వారి సెల్కు వెళ్లి పరిశీలించగా.. పెద్ద సొరంగం కనబడింది. అది జైలు గదినుంచి సరిగ్గా ప్రహారీ ఆవలికి దారితీసి ఉంది.
ఖైదీల పరారీపై జైలు అధికారుల సమాచారంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు ఫైజన్ ను పట్టుకోగలిగినప్పటికీ జావేద్ మాత్రం తప్పించుకున్నాడు. ఘటనను సీరియస్గా తీసుకున్న డీజీ అలోక్ వర్మ జైలుకు వెళ్లి తనిఖీ నిర్వహించారు. అయితే వివరాలు చెప్పేందుకు మాత్రం నిరాకరించారు. సొరంగం తవ్వేందుకు యంత్రపరికరాలు ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు.