
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్ధులపై ఆదివారం రాత్రి సాగిన ముసుగు దుండగుల దాడిని ముంబై పేలుళ్ల దాడితో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పోల్చారు. ముసుగులు ధరించిన దుండగులు ఇనుపరాడ్లు, హాకీ స్టిక్‌లతో విద్యార్ధులు, టీచర్లపై విరుచుకుపడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. విద్యార్ధులపై దాడులను తమ ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని ఈ ఘటనకు వ్యతిరేకంగా పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చిన విద్యార్దులకు ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై సత్వరమే నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ఢిల్లీ పోలీసులను ఆయన కోరారు. జామియా మిలియా విద్యార్ధుల నిరసనలను పోలీసులు ఎదుర్కొన్న తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో ఢిల్లీ పోలీసులు జాప్యానికి తావివ్వకుండా తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలో విద్యార్ధులు అభద్రతకు లోనయ్యే పరిస్థితి నెలకొందని, జేఏన్‌యూలో జరిగిన ఘటనలు మహారాష్ట్రలో తాను జరగనివ్వనని స్పష్టం చేశారు. యువతను రెచ్చగొట్టి వారితో చెలగాటమాడవద్దని హెచ్చరించారు. జేఎన్‌యూలో దాడికి పాల్పడిన ముసుగుల వెనుక ఎవరున్నారో మనం తెలుసుకోవాలని..ముసుగు ధరించేవారు పిరికిపందలని, ధైర్యం ఉన్న వారు బహిరంగంగానే ముందుకువస్తారని అన్నారు. ఇలాంటి పిరికిపందల చర్యలను సహించే ప్రసక్తి లేదని అన్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆదివారం రాత్రి దుండగుల దాడిలో 34 మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. ఈ దాడికి పాల్పడిండి ఏబీవీపీ కార్యకర్తలని జేఎన్‌యూ విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తుండగా, వామపక్ష విద్యార్ధులే తమ సభ్యులపై దాడి చేశారని ఏబీవీపీ నేతలు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment