‘పెళ్లికి వెళ్లిన జవాన్‌ను చంపారు.. ఏకం కారా?’
న్యూఢిల్లీ: దుష్ప్రచారాలతో తప్పు దోవపట్టిస్తున్న పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కశ్మీర్ యువత నిలబడే తరుణం ఇదేనని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ పాక్ బలగాలు అక్రమంగా హత్య చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన ఈ ఘటనకు వ్యతిరేకంగా పాక్ యూత్ మొత్తం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని విస్తరింపజేయాలని పాక్ కుట్రలు చేస్తుందని, అందులో కశ్మీర్ యువత బలికావొద్దని, సోషల్ మీడియాలో పాక్ చేసే దుష్ప్రచారాన్ని ఆకర్షితులవకుండా మనోధైర్యంతో దానిని తిప్పికొట్టాలని సూచించారు.
‘లెఫ్టినెంట్ ఫయాజ్ కశ్మీర్ లోయకు చెందిన వీర జవాను. ఎంతో కష్టపడి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చోటు సంపాధించుకున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో రాజ్‌పుటానా రైఫిల్స్‌లో బాధ్యతలు చేపట్టాడు. అతడు చాలా ధైర్యంగల యువకుడు.. ఓ వివాహం వేడుక చూసేందుకు ఇంటికెళ్లాడు. పండుగకు వెళ్లిన ఆ వీర జవానును క్రూరంగా చంపేశారు’ అని ఆర్మీ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కశ్మీర్ యువత తప్పనిసరిగా జోక్యం చేసుకోవాలని చెప్పారు. ఈ సమయంలో వారంతా ఏకమయ్యి సరైన మార్గమేమిటో చర్చించుకోవాలని సూచించారు. ఎవరు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారో దాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత వారిపై ఉందని గుర్తు చేశారు.