Padma Awards 2022: Central Government Announced Padma Awards on Republic Day - Sakshi
Sakshi News home page

Padma Awards 2022: బిపిన్‌కు విభూషణ్‌..

Published Tue, Jan 25 2022 8:13 PM | Last Updated on Wed, Jan 26 2022 5:01 AM

Padma Awards 2022 Announced - Sakshi

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అవార్డులు వరించిన వాళ్ల జాబితాను మంగళవారం విడుదల చేసింది. నలుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మ భూషణ్, 107 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణకు ఒక పద్మ భూషణ్‌తో పాటు 3 పద్మశ్రీ, ఏపీకి 3 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. పూనావాలా, సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌లకు పద్మ భూషణ్‌ దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌కు ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్‌ సింగ్‌ (మరణానంతరం), ప్రభా ఆత్రే ఎంపికయ్యారు.

పద్మ భూషణ్‌కు మాజీ కాంగ్రెస్‌ లీడర్‌ గులాం నబీ ఆజాద్, పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం, సీపీఐ (ఎం) నేత బుద్ధదేవ్‌ భట్టాచార్య, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారు చేసిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంస్థ చైర్మన్‌ సైరస్‌ పూనావాలా, కరోనా వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, పంజాబీ ఫోక్‌ సింగర్‌ గుర్మీత్‌ బవ, నటుడు విక్టర్‌ బెనర్జీ, కేంద్ర మాజీ హోం సెక్రటరీ రాజీవ్‌ మెహ్రిశ్రీలను కేంద్రం ఎంపిక చేసింది. తమిళనాడు రాష్ట్రం నుంచి నటి షావుకారు జానకి, అలాగే ఒలింపిక్స్‌లో బంగారు పథకం సాధించిన నీరజ్‌ చోప్రా, సింగర్‌ సోనూ నిగమ్‌లు పద్మశ్రీకి ఎంపికయ్యారు.

ఈసారి 34 మంది మహిళలు
వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వాళ్లకు ఏటా ఈ అవార్డులను ఇస్తుంటారు. ఈసారి మొత్తం 128 అవార్డులను ప్రకటించారు. అవార్డులు పొందిన వాళ్లలో 34 మంది మహిళలున్నారు. 10 మందిని విదేశీ, ఎన్నారై, పీఐఓ, ఓసీఐ విభాగంలో ఎంపిక చేసింది. 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించింది. ఇద్దరికి కలిపి ఒకే అవార్డును ఈసారి రెండు సందర్భాల్లో ఇచ్చింది. 

తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్లకే..
తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఏడుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు ఉన్నారు. పద్మ భూషణ్‌కు తెలంగాణ నుంచి భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులు ఎంపికయ్యారు. అలాగే తెలంగాణ నుంచి దర్శనం మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు).. ఏపీ నుంచి గోసవీడు షేక్‌ హాసన్‌ (కళలు) (మరణానంతరం), డాక్టర్‌ సుంకర వెంకట ఆది నారాయణరావు (వైద్యం), గరికపాటి నరసింహారావు (సాహిత్యం, విద్య)లను పద్మశ్రీ వరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement