సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత గాయకుడు, గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాల సుబ్రమణ్యంను ప్రతిష్టాత్మక ‘పద్మ విభూషణ్’ వరించింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబె సహా మరో ఆరుగురు కూడా భారత ప్రభుత్వం ప్రకటించే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ఈ ‘పద్మ విభూషణ్’కు ఎంపికయ్యారు. ఎస్పీ బాలుకు తమిళనాడు తరఫున ఈ పురస్కారం లభించడం గమనార్హం. కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవానిరతిని కనబరిచిన 119 మందికి కేంద్ర ప్రభుత్వం సోమవారం 2021 సంవత్సరానికి గానూ ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది.
ఏడుగురిని పద్మ విభూషణ్, 10 మందిని పద్మ భూషణ్, 102 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. సైకత శిల్పి సుదర్శన్ సాహూ, ప్రధాని మాజీ ప్రిన్స్‌పల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించారు. మాజీ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, మాజీ ముఖ్యమంత్రులు తరుణ్ గొగోయి(అస్సాం), కేశూభాయి పటేల్(గుజరాత్), లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్, ప్రముఖ గాయని కేఎస్ చిత్రలకు పద్మ భూషణ్ వరించింది. ఈ సంవత్సరం పద్మ అవార్డులు పొందిన వారిలో 29 మంది మహిళలున్నారు. విదేశీ/ప్రవాస భారతీయ కేటగిరీలో 10 మందిని భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది. ఒక ట్రాన్స్‌జెండర్ కూడా ఈ ఏడాది పద్మ పురస్కారం పొందారు. ఎస్పీ బాలు సహా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారం లభించింది. మాజీ గవర్నర్, దివంగత మృదుల సిన్హా, మాజీ కేంద్రమంత్రి బిజోయ చక్రవర్తిలకు పద్మ శ్రీ పురస్కారం ప్రకటించారు. పద్మ పురస్కారాలు పొందిన వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల నుంచి..
తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి పద్మ శ్రీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామికి కళలు విభాగం నుంచి పద్మశ్రీ పురస్కారం వరించింది. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో జన్మించిన ఆశావాది ప్రకాశరావుకు సాహిత్యం, విద్య రంగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిడుమోలు సుమతికి కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారం వరించింది. తెలంగాణ నుంచి కళల విభాగంలో కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం లభించింది.
ఇక భారతరత్న రావాలి
‘పాడనా తీయగా కమ్మని ఒక పాట. పాటగా బ్రతకనా మీ అందరి నోటా...’అంటూ ‘వాసు’సినిమాలో పాడారు యస్పీ బాల సుబ్రహ్మణ్యం. గత ఏడాది చివర్లో కోవిడ్ వల్ల అనారోగ్యం పాలై ఆయన మరణించిన విషయం తెలిసిందే. భౌతికంగా మన మధ్య లేకపోయినా పాటగా మనతోనే ఎప్పుడూ ఉంటారు. సంగీత కళాకారుడిగా ఆయన చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం యస్పీబీకి మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించింది. గాయకుడిగా సుమారు 40 వేల పాటలు పాడారాయన. సుమారు 50 ఏళ్ల కాలాన్ని సినిమాలకు పాడటానికే అంకితం చేయడం విశేషం. గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సంగీత దర్శకుడిగా, నటుడిగా యస్పీబీ ఎన్నో రకాల పాత్రలు పోషించారు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అందుకున్నారాయన. యస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాలని, ఆయన మరణించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.యస్. జగన్‌మోహన్ రెడ్డి. తమిళనాడుతో సహా పలు రాష్ట్రాలు కూడా ఆ వాదనను సమర్థించాయి.
సౌతిండియా నైటింగేల్
‘బొంబాయి’సినిమాలో ‘కన్నానులే కలయికలు ఈనాడు ఆగవులే...’అంటూ పాడారు చిత్ర. చనిపోయే ముందు అందరూ తప్పక వినాల్సిన 100 పాటలు అంటూ బ్రిటీష్ మేగజీన్ ‘ది గార్డియన్’చేసిన 100 పాటల జాబితాలో ఈ పాట ఉంది. ఇలా గాయని చిత్ర పాడిన పాటలు భాషలకు అతీతంగా శ్రోతల్ని చేరుతూనే ఉన్నాయి. అందుకే ఆమెను సౌతిండియా నైటింగేల్ అన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చిత్రకు పద్మ భూషణ్ ప్రకటించింది. గాయనిగా సుమారు 25 వేల పాటలు ఆలపించారు చిత్ర. 1979లో మలయాళ ప్రైవేట్ ఆల్బమ్‌తో గాయనిగా మారారు చిత్ర. 2005లో పద్మశ్రీ అందుకున్నారు. ‘సింధు భైరవి’అనే తమిళ అనువాద చిత్రంలో ‘పాడలేను పల్లవైనా..’పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఎన్నో పల్లవులు. చరణాలు పాడుతూనే ఉన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment