సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ అనాలోచిత నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులు 75 మెడిసిన్ సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఓ కళాశాల నిబంధనలు ఉల్లంఘించిందంటూ తొలుత రెండేళ్లు అడ్మిషన్లు జరపకుండా ఉత్తర్వులిచ్చిన ఆరోగ్య శాఖ.. ఆ తర్వాత వాటిని రద్దు చేస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అప్పటికే ఎంబీబీఎస్ సీట్ల తది కౌన్సెలింగ్ గడువు ముగియడంతో విద్యార్థులు నష్టపోవాల్సి వచ్చింది.
సంతకాలు సరిపోలేదని..: మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు 2017–18 విద్యాసంవత్సరంలో 150 సీట్లతో ఎంబీబీఎస్ కోర్సు నిర్వహణకు కేంద్ర ఆరోగ్య శాఖ రెన్యువల్ జారీ చేసింది. అయితే భారత వైద్య మండలి (ఎంసీఐ) గతేడాది డిసెంబర్ 6, 7ల్లో ఆ కళాశాలలో ఆకస్మిక తనిఖీ చేసి ఓ అధ్యాపకుడు, ఇద్దరు రెసిడెంట్ డాక్టర్ల సంతకాలు సరిపోలలేదని తేల్చింది.
ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించింది. సదరు కమిటీ ఈ వ్యవహారాన్ని పరిష్కరించకముందే వైద్య కళాశాల స్థాపన నిబం ధనల్లోని 8(3)(1)(డీ)ని అమలు చేస్తూ 2018–19, 2019–20 ల్లో కళాశాల అడ్మిషన్లు జరపకుండా నిషేధించాలని కేంద్రానికి ఎంసీఐ కార్యనిర్వాహక కమిటీ సిఫారసు చేసింది. కేంద్రం 2018 మే 31న అడ్మిషన్లు తీసుకోకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులిచ్చింది.
నిబంధనలో ఎక్కడా లేదంటూ..
అడ్మిషన్ల రద్దుపై కళాశాల పలు అభ్యర్థనలు చేయగా తిరిగి ఆగస్టు 31న ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకున్నట్లు కేంద్రం మరో ఉత్తర్వు జారీ చేసింది. సంతకాలు సరిపోని విషయం తనిఖీలో తేలగా అది ఫోర్జరీ సంతకమా కాదా అని ఎథిక్స్ కమిటీ పరిష్కరించలేదని, కానీ తదుపరి విచారణ చేయకుండానే 8(3)(1)(డీ) నిబంధనను అమలు చేస్తూ అడ్మిషన్ల నిరాకరణకు ఎంసీఐ సిఫారసు చేసిందని ఉత్తర్వులో పేర్కొంది. అధ్యాపకులకు సంబంధించిన డాక్యుమెంట్ల వివరాల్లో అవకతవకలుంటే ఈ నిబంధన ఉపయోగించవచ్చని, అయితే కోర్సులో ప్రవేశాలు అనుమతించరాదని నిబంధనలో ఎక్కడా లేదంది.
అప్పటికే ముగిసిపోయింది..: సంతకాలు సరిపోని వ్యవహారం పరిష్కరించకుండా అడ్మిషన్లను నిరాకరించడం వల్ల విద్యార్థులు నష్టపోయారు. కొత్త ఉత్తర్వులు ఆగస్టు 31న వచ్చినా అదే తేదీన ప్రవేశాల గడువు ముగిసింది. ఉత్తర్వులు అందిన వెంటనే యాజమాన్య కోటాలోని బీ, సీ కేటగిరీలో 75 సీట్లను సంస్థ భర్తీ చేసింది. కానీ కౌన్సెలింగ్‌కు గడువు లేకపోవడంతో విద్యార్థులు 75 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది.
కౌన్సెలింగ్ పొడిగింపునకు కోర్టు నో: అడ్మిషన్ల పునరుద్ధరణ ఉత్తర్వులు ఆగస్టు 31న వచ్చినందున కౌన్సెలింగ్‌కు గడువు పొడిగించాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని సంస్థ అభ్యర్థించింది. ఆగస్టు 31ని మించి ప్రవేశాలు జరపరాదని సుప్రీం కోర్టు గతంలో ఆదేశాలిచ్చినందున కౌన్సెలింగ్ పొడిగింపు అనుమతికి సుప్రీంను వర్సిటీ ఆశ్రయించింది. బుధవారం పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. వర్సిటీ అభ్యర్థనను తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment