మంచినీళ్ల కోసం ఆశ్రమానికి వెళితే..
లక్నో: సామాన్యుడి నుంచి ప్రధాని వరకు దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు ఓ పక్క ఖండిస్తుండగానే అలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఎక్కువగా దళితులపై దాడులు జరిగే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఆశ్రమంలోని చేతిపంపు వద్ద ఓ దళిత తండ్రి, కూతురు నీళ్లు తెచ్చుకున్నారనే కారణంతో కొందరు వ్యక్తులు దాడి చేశారు. వారిని ఇష్టం వచ్చినట్లు కొట్టి గాయపరిచారు. శంబాల్ జిల్లాలోని గున్నార్ ప్రాంతంలోని దుండా అనే ఓ ఆశ్రమం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
పొలంలో పనిచేస్తున్న 13 ఏళ్ల బాలిక దాహంతో నీళ్ల కోసం వెళ్లి ఆశ్రమం వద్ద ఉన్న చేతిపంపువద్దకు వెళ్లగా ఆ బాలికను నీళ్లు తీసుకొవద్దని కొట్టారు. ఇదేమిటని ప్రశ్నించినందుకు ఆ పాప తండ్రిని కూడా దయలేకుండా దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
దళితులపై దాడి విషయంలో మోదీ ఇటీవల కాస్తంత ఎమోషనల్ గా మాట్లాడిన విషయం తెలిసిందే. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా అంటరానితనం ఇంకా పాటించడం పాపం అని మోదీ అన్నారు. ఎవరికైనా దళితులను కొట్టాలని ఉన్నా, వారిని షూట్ చేయాలని ఉన్నా ముందు తనను కొట్టండని, తనను షూట్ చేయండని.. తన దళిత సోదరీసోదరులను కాదని మోదీ చెప్పారు. అయినప్పటికీ దళితులపై దాడుల ఘటనలు పెరుగుతుండటం గమనార్హం.