
కొడుకు శవంతో.. రాత్రంతా ఆస్పత్రి ముందు!
'స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్'.. ఈ మాట ఎన్ని సంవత్సరాల నాటిదైనా ఇప్పటికీ దాని విలువ అలాగే ఉంది. పెళ్లికి ఎంత ఖర్చవుతుందో చావుకు కూడా దాదాపు అంతే ఖర్చవుతోంది. అది భరించలేని వాళ్లకు నరకం కళ్లెదుటే కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో కొడుకు శవాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి తల్లి దగ్గర డబ్బులు లేకపోవడంతో... రాత్రంతా ఆ శవాన్ని కళ్లెదుటే పెట్టుకుని జాగారం చేయాల్సి వచ్చింది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న తన కొడుకుని ఆమె ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆ పిల్లాడు మరణించాడు. కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు 108 అంబులెన్సుకు ఫోన్ చేయగా.. శవాన్ని తీసుకెళ్లాలంటే రూ. 1500 ఖర్చవుతుందని అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు. ఆమె దగ్గర అతడికి ఇవ్వడానికి ఆమ మాత్రం డబ్బులు కూడా లేకపోవడంతో ఎలాగోలా తీసుకెళ్లాలని ప్రాధేయపడింది. అయినా ఫలితం లేకపోవడంతో ఆ తల్లి.. రాత్రంతా కొడుకు శవాన్ని కళ్ల ముందు పెట్టుకుని అలాగే ఉండిపోవాల్సి వచ్చింది.
ఇటీవలే కాన్పూర్‌లోని జేఎస్‌వీఎం మెడికల్ కాలేజిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 12 ఏళ్ల పిల్లాడు తండ్రి భుజాల మీదే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక ఒడిషాలో అయితే ఓ వ్యక్తి తన భార్య శవాన్ని ఇంటికి తీసుకెళ్లే దారి లేక పది కిలోమీటర్ల దూరం శవాన్ని భుజం మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.