![అటు ఆందోళనలు.. ఇటు బీజేపీ విప్](/styles/webp/s3/article_images/2017/09/3/51439278884_625x300.jpg.webp?itok=5x5r2tfL)
అటు ఆందోళనలు.. ఇటు బీజేపీ విప్
ఢిల్లీ: అనేక కీలక బిల్లులను ఆమోదించుకోవాల్సిన నేపథ్యంలో అధికార బీజేపీ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఇవాళ రేపు కచ్చితంగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
మంగళవారం పార్లమెంటు ఉభయ సభల సమావేశాల్లో ఆందోళన కొనసాగింది. ముఖ్యంగా లోక్సభలో వ్యాపం, లలిత్ గేట్ వివాదంలో విపక్షాల ఆందోళనతో రగడ మొదలైంది. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. లలిత్ గేట్ వివాదంపై చర్చ జరగాల్సిందేనంటూ పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియం ముందుకు దూసుకు వచ్చారు. దీంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న సుమిత్ర మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట సభల్లో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. వర్షాకాల సమావేశాల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన మూలంగా దేశంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. దీని మూలంగా ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు అందుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. సభ కార్యక్రమాలకు అడ్డు తగొలద్దని విజ్ఞప్తి చేశారు. అయినా సభ్యులు ఆందోళన విరమించలేదు.
మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్ సహా విపక్ష సభ్యుల ఆందోళన చల్లారలేదు. కళంకిత మంత్రులు రాజీనామా చేయాలంటూ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులతో స్పీకర్ కురియన్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో మధ్నాహ్నం 12.30 ని.లకు సభను వాయిదా వేశారు.