దేవుడే కాపాడితే.. పాలకులెందుకు?
ప్రపంచంలో ఉన్న పోలీసులు అందరినీ కాపలాకు దించినా.. అత్యాచారాలు జరగకుండా ఆపలేరని, అందువల్ల ఇక మహిళలను దేవుడే కాపాడాలని ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. దేవుడు అవతరిస్తే తప్ప నేరాలు నియంత్రణలోకి రావని కూడా గవర్నర్ అజీజ్ ఖురేషీ వ్యాఖ్యానించారు. వచ్చినవాళ్లు హలీం, బిర్యానీలు తిని వెళ్లిపోవాలి తప్ప అత్యాచారాల గురించి మాట్లాడతారెందుకని పాత్రికేయుల మీద కూడా మండిపడ్డారు.
ఉత్తరప్రదేశ్లో కనీసం రోజుకు రెండు మూడు అత్యాచారాలు జరుగుతున్నాయంటూ అటు జాతీయ నేర రికార్డుల బ్యూరో, మహిళా కమిషన్, ఇలా పలు వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. వీటి గురించి అటు అక్కడి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గానీ, అధికార పార్టీకి జాతీయస్థాయి అధ్యక్షుడిగా ఉన్న సీఎం తండ్రి ములాయం సింగ్ యాదవ్ గానీ సీరియస్గా పట్టించుకున్న పాపాన పోలేదు.
పైపెచ్చు, సమయం వచ్చినప్పుడల్లా, సందర్భం ఉందనుకున్పప్పుడల్లా నాయకులు ఈ అత్యాచారాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇంత పెద్ద రాష్ట్రంలో, 22 కోట్ల జనాభా ఉన్నప్పుడు దానితో పోలిస్తే జరుగుతున్న అత్యాచారాల సంఖ్య చాలా తక్కువని, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల మీదే జనమంతా మండిపడితే.. ఇప్పుడు ఏకంగా గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తే ఇలా మాట్లాడటం మరింత వివాదానికి కారణమైంది. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఆయన తన కార్యాలయ గౌరవాన్ని తగ్గించారని యూపీ బీజేపీ అధ్యక్షుడు మనోహర్ సింగ్ అన్నారు. పదవి నుంచి దిగిపోవడానికి ఒక్క రోజు ముందే గవర్నర్ ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త గవర్నర్ రామ్ నాయక్ మాత్రం నేరాలను రాజకీయం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పారదర్శకమైన దర్యాప్తుతో దోషులను తక్షణమే శిక్షించాలన్నారు.