లక్నో: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) ధాటికి మహారాష్ట్ర, దేశ రాజధాని ఢిల్లీ, తమిళనాడు తదితర రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. మహమ్మారి విజృంభణతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రికవరీ రేటు కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ మూడు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు వైరస్ ప్రభావిత రాష్ట్రాల చర్చలకు కేంద్ర బిందువుగా మారాయి. ఇలాంటి తరుణంలో దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనాను కట్టడిలో మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఇటీవల ఓ కార్యక్రమంలో కోవిడ్‌పై పోరులో కొన్ని దేశాలతో పోల్చినపుడు యూపీ ముందు ఉందంటూ ప్రశంసించడం గమనార్హం. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, ఇంగ్లండ్ తదితర నాలుగు దేశాల మొత్తం జనాభాతో సమానమైన జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ ఈ మేరకు ఎలా విజయం సాధించగలుగుతోంది? ఇందులో వాస్తమెంత? ఇందుకు గల కారణాలేంటి?
టాప్-5లో ఉత్తరప్రదేశ్.. అయితే
ఉత్తరప్రదేశ్ జనాభా సుమారుగా 23.15 కోట్లు. కోవిడ్ అత్యంత ప్రభావిత రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉన్న మహారాష్ట్రతో పోలిస్తే ఇది రెట్టింపు. అయినప్పటికీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్యలో యూపీ ఐదో స్థానంలో ఉంది. బుధవారం నాటికి యూపీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 30 వేలు దాటింది. ముంబై(84 వేలు), చెన్నై(71 వేలు) తదితర నగరాల్లోని కరోనా బాధితుల సంఖ్యలో ఇది సగం కంటే తక్కువ. ఇక ప్రతీ పది లక్షల మంది జనాభాలో కరోనా సోకుతున్న వారి సంఖ్య ఢిల్లీలో సుమారు 5 వేలు, మహారాష్ట్రలో 1700, తమిళనాడులో 1500, తెలంగాణలో 7 వందలకు పైగా, హర్యానాలో 639గా ఉండగా.. యూపీలో కేవలం 133 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. (కోవిడ్-19 అప్‌డేట్ : 24 గంటల్లో 25,000 కేసులు)
తక్కువ టెస్టులే.. అయినప్పటికీ
ఉత్తరప్రదేశ్‌లో బుధవారం నాటికి కోవిడ్ మరణాల సంఖ్య 845కు చేరుకుంది. దాదాపు 10 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మంది మాత్రమే టెస్టులు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే యూపీ పరీక్షల సంఖ్య ఎక్కువగానే ఉన్నా.. జనాభా ప్రకారం చూస్తే మాత్రం ఇది తక్కువే. కరోనా నిర్ధారణ పరీక్షల్లో వెనుకబడిన రాష్ట్రాల్లో బిహార్, తెలంగాణ తర్వాత యూపీ మూడో స్థానంలో ఉంది.
కాగా ప్రతీ 10 లక్షల మంది జనాభాలో బిహార్‌లో 2300, తెలంగాణలో 3500కు పైగా మందికి టెస్టులు చేయగా.. యూపీలో సుమారు 4100 మందికి పరీక్షలు నిర్వహించారు. అయితే టెస్టుల సంఖ్య తక్కువగా ఉన్న.. టెస్టులు చేయించుకున్న వారిలో దాదాపు 3.25 శాతం మందికి మాత్రమే పాజిటివ్‌గా తేలడం ఉత్తరప్రదేశ్‌కు సానుకూల అంశంగా పరిణమించింది. అంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే యూపీలో టెస్టులు చేయించుకున్న వారిలో అతి తక్కువ మందికి కరోనా సోకినట్లు తేలింది. దీనిని బట్టి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కాస్త తక్కువగానే ఉన్నట్లు లెక్క. (చుక్కల్లో కోవిడ్-19 ఔషధం ధర..)
మరణాల రేటు చాలా తక్కువ
లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వచ్చిన తర్వాత పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. అయితే యూపీలో మాత్రం దీని ప్రభావం కాస్త తక్కువగానే ఉంది. జూన్‌లో పాజిటివ్ కేసుల సంఖ్యలో ఒక్కసారిగా పెరుగుదల నమోదు కాగా జూలై 7న ఒక్కరోజులోనే 1332 మంది కరోనా బారిన పడ్డారు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత అంటే జూన్ 7 నుంచి జూలై 7 మధ్య నెల రోజుల వ్యవధిలో తెలంగాణలో కేసుల పెరుగుదల 7.56, కర్ణాటకలో 4.92, హర్యానాలో 4.05, తమిళనాడులో 3.75, ఢిల్లీలో 3.35, పశ్చిమ బెంగాల్‌లో 2.91 శాతంగా నమోదు కాగా.. ఉత్తరప్రదేశ్‌లో కేవలం 2.84 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.
పది లక్షల జనాభాకు ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు కరోనాతో 845 మంది మృతి చెందినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే సోమవారం నాటికి వీటి సంఖ్య 827. అంటే యూపీలో దాదాపు పది లక్షల మంది జనాభాలో ముగ్గురు కోవిడ్‌తో మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. జాతీయ సగటు 15తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో యూపీలో మరణాల రేటు 2.76గా ఉండగా.. ఢిల్లీలో 3.8, పశ్చిమ బెంగాల్‌లో 3.37, మధ్యప్రదేశ్లో 3.98, మహారాష్ట్రలో 4.26, గుజరాత్‌లో అత్యధికంగా 5.25 శాతంగా ఉంది.
ఆ జిల్లాల్లోనే అత్యధిక కేసులు
వాస్తవానికి నేషనల్ కాపిటల్ రీజియన్(దేశ రాజధాని ప్రాంతం) పరిధిలో ఉన్న యూపీ జిల్లాల్లోనే అత్యధిక పాజిటివ్ కేసుల నమోదవుతున్నాయి. గౌతమ్‌బుద్ధ నగర్‌లో సుమారుగా 3 వేలు, ఘజియాబాద్‌లో 2400 వేల మంది కరోనా బారిన పడ్డారు. ఇక రాజధాని లక్నోలో 1600కు పైగా, కాన్పూర్ నగర్, ఆగ్రా వంటి పట్టణాల్లో 1300కు పైగా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఆగ్రా, మీరట్‌లలో మరణాల రేటు దాదాపు 7 శాతం ఉండటం గమనార్హం. అదే విధంగా ఘజియాబాద్(63), కాన్పూర్ నగర్(62), ఫిరోజాబాద్(30)లతో పోలిస్తే యూపీలోని దాదాపు 30 జిల్లాల్లో మరణాల సంఖ్య తక్కువగానే ఉంది. అదే విధంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో అతి తక్కువ గణాంకాలు నమోదవుతున్న జిల్లాలు 20 వరకు ఉన్నాయి.
కారణాలివే..
లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం, వైద్యాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షించడం, భారీ సంఖ్యలో హెల్‌్పడెస్క్‌లు ఏర్పాటు చేయడం, జాగ్రత్తలు పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించడం, ముఖ్యంగా గ్రామీణ జనాభా శాతం(దాదాపు 77%)ఎక్కువగా ఉండటం కారణంగానే యూపీ ఈ మేరకు కరోనావ్యాప్తిని కట్టడి చేయగలిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అదే విధంగా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంపై దృష్టి సారించిన యోగి సర్కారు తీసుకుంటున్న చర్యల వలన అక్యూట్ ఎన్సెఫలిటిస్ సిండ్రోమ్(ఏఈఎస్- విపరీతమైన జ్వరం, మానసిక ఆరోగ్యంపై ప్రభావం) పేషెంట్ల సంఖ్య భారీగా తగ్గడం, మరణాల సంఖ్య కూడా 90 శాతానికి పడిపోవడం కూడా సానుకూల అంశంగా పరిణమించిందని పలువురు పేర్కొంటున్నారు. కాగా యూరప్‌లో నాలుగు దేశాలు యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్‌లతో దాదాపు 1,37,745 మంది కోవిడ్‌తో మరణించగా... యూపీలో కేవలం 845 కరోనా మరణాలు సంభవించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment