యోగి ఆదిత్యానాథ్
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో పలు నగరాల పేర్లు మార్చిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మరో సంచలనానికి సిద్దమయ్యాడు. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ను శ్రీ అయోధ్యగా మార్చిన యోగి ప్రభుత్వం ఇప్పుడు ఆ నగరాల్లో సంపూర్ణ మద్యం, మాంసం నిషేధం విధించడానికి సిద్దమైంది. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందిన ఆ రాష్ట్ర మంత్రి, శ్రీకాంత్ శర్మ మంగళవారం మీడియాకు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మధురలో ఈ తరహా నిషేదం విధించిందని, ఇప్పడు అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ల్లో కూడా నిషేదం విధించాలని ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయోధ్యలో మద్యం, మాంసం అమ్మడం శ్రీరామునికే అమర్యాదకమన్నారు.
నగరాల పేర్లు మార్చడంపై దేశవ్యాప్తంగా యోగి ప్రభుత్వంపై విమర్శలొస్తున్నాయి. ప్రతిపక్షాలే కాకుండా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలు సైతం యోగిని తప్పుబడుతున్నాయి బీజేపీ పార్టీలో ఉన్న ముస్లిం ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు కూడా మారుస్తారా? అంటూ మిత్రపక్షం ఎస్‌బీఎస్‌పీ నేత, యోగి ఆదిత్యనాథ్ క్యాబినేట్‌లో మంత్రిగా పనిచేస్తోన్న ఓమ్ ప్రకాశ్ రాజ్భర్ సవాలు చేసిన విషయం తెలిసిందే. ఇక నగరాల పేర్ల మార్పుపై దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ కోర్టు కొట్టేసింది. పిటిషనర్ తొలుత రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment