'యూపీని నాలుగు ముక్కలు చేయాల్సిందే'
పరిపాలన సౌలభ్యం కోసం దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ ను నాలుగు ముక్కలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి జైరాం రమేశ్ అన్నారు. 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్ ను పాలించడం ఏ ముఖ్యమంత్రికైనా తలకు మించిన భారమనే అభిప్రాయాన్ని జైరామ్ వ్యక్తం చేసినట్టు సీఎన్ఎన్ ఐబీన్ న్యూస్ ప్రజెంటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ ట్విట్ చేశారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై తాను వెల్లడించిన అభిప్రాయాలన్ని వ్యక్తిగతమే అని జైరామ సీఎన్ఎన్ ఐబీఎన్ కు తెలిపారు. 'వైశాల్యం, జనాభా అంశంలో ఉత్తర ప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం. సుపరిపాలనకు అనేక అడ్డంకులుంటాయి' అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.
ఇక రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే కేబినెట్ లో అంత కొత్తవారే ఉంటారు అని అన్నారు. 59 ఏళ్ల వయస్సు ఉన్న తనలాంటి వారు మంత్రివర్గంలో ఉండటం అనేది ఓ చరిత్రగా మిగిలిపోతుంది అని జైరాం అన్నారు. అభ్యర్థుల ఎంపిక ముందు వచ్చే ఒపినియన్ పోల్స్, సర్వేలను నమ్మవద్దన్నారు. అయితే దేశంలో కాంగ్రెస్ కు ప్రస్తుతం ఎదురుగాలి విస్తోందని జైరాం అన్నారు.