సాక్షి, లక్నో : యూపీలోని బదౌన్‌లో దుండగులు కూలగొట్టిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. అయితే ఈ విగ్రహంలో అంబేడ్కర్ తరచూ కనిపించే సూట్‌లో కాకుండా కాషాయ రంగులో ఉన్న ప్రిన్స్ సూట్‌లో కనిపిస్తుండటం గమనార్హం. అంబేడ్కర్ విగ్రహానికి కాషాయం పులమడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఎస్‌పీ నేత హిమేంద్ర గౌతం కాషాయం రంగు మార్చి నీలం రంగు వేయించారు. వివరాల్లోకి వెళితే.. బదౌన్ ప్రాంతంలోని దగ్రాయ గ్రామంలో ఈనెల ఏడున కొందరు దుండగులు అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో బదౌన్ ప్రాంతం ఆందోళనలతో హోరెత్తగా స్పందించిన అధికార యంత్రాంగం ఆగ్రా నుంచి ఆఘమేఘాలపై మరో విగ్రహాన్ని తెప్పించి అదే ప్రాంతంలో ప్రతిష్టించింది.
అయితే కాషాయ రంగులో విగ్రహం రూపొందించడం పట్ల అధికారులను ప్రశ్నించగా వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు ఈ వ్యవహారంలో తమ పార్టీ ప్రమేయం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ స్వరూప్ పట్నాయక్ అన్నారు. ‘ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారు. విగ్రహంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు..కాషాయ వర్ణమైతే భారత సంస్కృతికి ప్రతీక’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మార్చిలో సిద్ధార్ధనగర్, అలహాబాద్‌లో 24 గంటల వ్యవధిలోనే రెండు అంబేడ్కర్ విగ్రహాలను దుండగులు కూల్చివేశారు. ఏమైనా కొద్ది గంటల్లోనే అంబేడ్కర్ విగ్రహం నీలం నుంచి కాషాయం..కాషాయంలోంచి నీలంలోకి మారింది.
Comments
Please login to add a commentAdd a comment