
చెన్నైలో ‘వర్దా’ బీభత్సం
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో వర్దా తుపాను బీభత్సం సృష్టించింది. చైన్నె-పులికాట్ సరస్సు మధ్య తుపాను తీరం దాటుతుండడంతో చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయడంతో వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్తగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ ను నిలిపివేశారు.
గాలుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తిరువళ్లూరులో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. సాయంత్రం వరకు ఇళ్లలోంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
భారీ వర్షాలతో చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. చెన్నై విమానాశ్రయంలో సాయంత్రం 6 గంటలకు రాకపోకలు నిలిపివేశారు. సహాయక కార్యక్రమాలకు సైన్యాన్ని సిద్ధంగా ఉంచారు. సాయంత్రం 6 గంటల కల్లా చెన్నైని తుపాను వీడనుందని సమాచారం. భారీ వర్షాలతో ఇప్పటివరకు చెన్నైలో ఇద్దరు చనిపోయారు.
- చెన్నైలో సబర్బన్ రైళ్లు రద్దు
- చెన్నై విమానాలు హైదరాబాద్, బెంగళూరుకు మళ్లింపు
- చెన్నైలో గరిష్టంగా 192 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం: వాతావరణ శాఖ