మెటర్నిటీ లీవ్ ఇక ఎనిమిది నెలలు!
న్యూఢిల్లీ: తల్లి పాలు పట్టడమే శిశుకులకు బలమని ప్రచారం చేస్తోన్న కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ(డబ్ల్యూసీడీ).. ఆ మేరకు గర్భం దాల్చిన ఉద్యోగినులకు ఇచ్చే మెటర్నిటీ లీవ్ ను ఆరున్నర నెలల నుంచి ఎనిమిది నెలలకు పెంచాలన్న ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వంలోని ఇతర శాఖలన్నీ శనివారం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపాయి. దీంతో మెటర్నిటీ లీవ్ పై నిర్ణయం కీలక దశకు చేరుకున్నట్లయింది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినులకు పూర్తి వేతనంతో కూడిన ఆరున్నర నెలల మెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు. అయితే శిశువులకు తల్లిపాలుపట్టి వారిని బలవర్ధకంగా తయారుచేసేందుకు ఈ సమయం సరిపోదని, మెటర్నిటీ లీవ్ ను కనీసం ఎనిమిది నెలలైనా మంజూరుచేయాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ వాదిస్తున్నారు. సెలవుల పెంపుపై తమ శాఖ నుంచి ప్రతిపాదనలు సిద్ధం చేయించారు.
కేంద్ర కార్మిక శాఖ గతంలోనే ఆమోదం తెలుపగా ఇప్పుడు మిగతా శాఖలూ మెటర్నిటీ లీవుల ప్రతిపాదనలకు పచ్చజెండా ఉపాయి. 'ఎనిమిది నెలల మెటర్నిటీ లీవ్ కు అన్ని శాఖలు ఓకే చెప్పాయి. ఒకటి రెండు రోజుల్లో ఫైలును కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని సెక్రటరీల కమిటీకి పంపుతాం. వాళ్ల ఆమోదంతో ఫైలు నేరుగా కేంద్ర మంత్రివర్గం ఎదుటికి వెళుతుంది' అని డబ్ల్యూసీడీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.