మోదీ వివాదంలో కొత్త మలుపు | Vasundhara Raje supported Lalit Modi's immigration plea in 2011 | Sakshi
Sakshi News home page

మోదీ వివాదంలో కొత్త మలుపు

Published Tue, Jun 16 2015 8:01 PM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

మోదీ వివాదంలో కొత్త మలుపు

మోదీ వివాదంలో కొత్త మలుపు

- ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లపై రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సంతకం
- 2011 నాటి పత్రాలు బహిర్గతం..
- పోర్చుగల్ ఆసుపత్రితో రాజస్థాన్ ప్రభుత్వం భూ ఒప్పందం.. అదే ఆసుపత్రిలో లలిత్ మోదీ భార్యకు ఆపరేషన్
- బీజేపీపై విమర్శల దాడి ముమ్మరం చేసిన కాంగ్రెస్

న్యూఢిల్లీ:
సంచలనం సృష్టిస్తోన్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఇమిగ్రేషన్ వివాదంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. 2011లో మోదీ భారత్ నుంచి సురక్షితంగా యూకే వెళ్లేందుకు నేటి రాజస్థాన్ ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నాయకురాలు వసుంధరా రాజే సహకరించినట్లు తెలిసింది. 18, ఆగస్టు, 2011 తేదీని సూచిస్తూ లలిత్ మోదీ యూకే ఇమిగ్రేషన్ కు సమర్పించిన దరఖాస్తులో వసుంధర రాజే సాక్షి సంతకం చేశారు. అయితే అనూహ్యరీతిలో మోదీ పర్సనల్ రిలేషన్స్ సిబ్బందే ఈ డాక్యుమెంట్లను బహిర్గతం చేశారు. మోదీ భార్యకు క్యాన్సర్ చికిత్స చేసిన పోర్చుగల్ ఆసుపత్రి విషయంలోనూ  కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోర్చుగల్ రాజధాని లస్బన్ కేంద్రంగా పనిచేసే సదరు ఆసుపత్రి రాజస్థాన్ లో రీసెర్చ్ సెంటర్ స్థాపించాలనుకుంది. అందుకు అనుగుణంగా ఆ ఆసుపత్రికి 35 వేల ఎకరాల భూమిని ఉచితంగా కేటాయిస్తున్నట్లు వసుంధర రాజే ప్రభుత్వం అక్టోబర్ 2, 2014న జోవో జారీ చేసింది. సరిగ్గా ఇది జరిగిన రెండు నెలల తర్వాత అదే ఆసుపత్రిలో లలిత్ మోదీ భార్యకు ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్ ఉచితంగా నిర్వహించారా లేదా అనే విషయాలు ఇంకా తెలియాల్సిఉంది.

భార్య ఆపరేషన్ కోసం ఇంగ్లాండ్ నుంచి పోర్చుగల్ వెళ్లాలనుకున్న మోదీకి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సాయం చేయడం, ఇప్పుడా విషయం వెలుగులోకి రావడంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగడం తెలిసిందే. తాజాగా వివాదంలో వసుంధరరాజే పాత్ర కూడా స్పష్టం కావడంతో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడిని ముమ్మరం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement