ముఖ్యమంత్రి ఇంటిపై దాడి
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుడు కలిఖో పుల్ (48) అనుమానాస్పద మృతి అంశం ఆందోళనకరంగా మారింది. ప్రస్తుత కొత్త ముఖ్యమంత్రి పెమా ఖండూ నివాసంపై కొంతమంది దాడులకు దిగారు. వీధుల్లోకి వచ్చి నిరసన నినాదాలు చేస్తూ పెమా ఖండూ నివాసంపై రాళ్లు విసిరారు. అనంతరం డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ వద్దకు వెళ్లి అక్కడి వాహనాలను ధ్వంసం చేశారు. కొన్నింటికి నిప్పు పెట్టారు. దాంతోపాటు అక్కడే నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద ఉన్న వస్తువులకు నిప్పంటించారు. అలాగే, సమీపంలోని మంత్రుల నివాసాలపై కూడా దాడి చేశారు.
కలిఖో పుల్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. రాజకీయపరమైన ఒత్తిడి కారణంగానే ఆయన బలవన్మరణానికి పాల్పడివుండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, కుంగుబాటు కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని హోంశాఖ అధికారులు తెలిపారు. గత నెలలో ఆయన పదవి కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్ కు ఆయన 145 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఫిబ్రవరి 19 నుంచి జూలై 13 వరకు సీఎంగా ఉన్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సాయంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి దక్కించుకున్నారు.