క్షమాపణ చెప్పిన గాయకుడు
ముంబై: వివాదంలో చిక్కుకున్న గాయకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆమ్) నాయకుడు విశాల్ దద్లానీ రాజకీయాల నుంచి వైదొలుతున్నట్టు ప్రకటించారు. జైన దిగంబర బాబా తరుణ్ సాగర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ‘నేను చేసిన వ్యాఖ్యలతో నా జైను స్నేహితులు, అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ మనోభావాలు దెబ్బతిన్నాయి. క్రియాశీల రాజకీయాలకు, కార్యకలాపాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాన’ని విశాల్ ట్వీట్ చేశారు.
హర్యానా వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈ నెల 26న దిగంబర బాబా సభను ఉద్దేశించి ప్రసంగించారు. దీనిపై విశాల్ ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ వివాదస్పదమయ్యాయి. శాసనసభను ఉద్దేశించి ప్రసంగించిన దిగంబర బాబా ఫొటో పోస్ట్ చేసి.. ‘ఇలాంటి వాళ్లకు ఓటు వేస్తే... ఇలాంటి న్యూసెన్స్ కు బాధ్యులవుతారు. మంచి రోజులు రావు. చెడ్డ రోజులే వస్తాయ’ని ట్వీట్ చేశాడు.
విశాల్ వ్యాఖ్యలను కేజ్రీవాల్ తప్పుబట్టారు. తరుణ్ సాగర్ చాలా మంచి గురువు అని, ఆయన జైనులకే కాదు అందరికీ గురువు అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.
It feel bad that I hurt my Jain friends & my friends @ArvindKejriwal & @SatyendarJain .I hereby quit all active political work/affiliation.
— VISHAL DADLANI (@VishalDadlani) 27 August 2016