
అతనే కావాలని...
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘షోలే’ సినిమాలో హేమమాలినితో పెళ్లి చేయాలని ధర్మేంద్ర వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి బెదిరించటం ఆ చిత్రం చూసిన వారికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా స్ఫూర్తితో అచ్చం అలాంటి సంఘటనే జార్ఖండ్‌లో కూడా జరిగింది. అయితే ఇక్కడ బెదిరించింది అబ్బాయి కాదు.. అమ్మాయి. జార్ఖండ్‌కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి 150 అడుగుల ఎత్తున్న హైవోల్టేజ్ టవర్‌పైకి ఎక్కి తన ప్రియుడుతో పెళ్లి జరిపించాలని పట్టుబట్టింది.
అతనితో పెళ్లి చేయకపోతే దూకేస్తానని బెదిరించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె ప్రియుడిని, తల్లిదండ్రులను అక్కడికి రప్పించారు. పెళ్లి చేసుకుంటానని ప్రియుడు, పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో ఆమె కిందికి దిగింది. షోలే చిత్రం స్ఫూర్తితోనే టవర్ ఎక్కిన ట్లు ఆ అమ్మాయి పేర్కొనడం కొసమెరుపు.