'మంత్రి పదవి కావాలా.. ఇటు రండి'
బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు కావాలని ఆశించేవాళ్లంతా తన వద్దకు రావాలని ఓ బహిరంగ కార్యక్రమంలో ఆహ్వానం పలికారు. మరి కొన్నిగంటల్లో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న మాంఝీ ఈ వ్యాఖ్యలు చేయడం పలు విమర్శలకు దారి తీసింది. పాట్నాలోని ఎస్కే మెమోరియల్ హాల్లో మహాదళితులతో సమావేశమైన ఆయన ఈ మాటలన్నారు.
మహాదళితుల గౌరవాన్ని కాపాడటమే తన లక్ష్యమని, తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఏమైనా చేస్తానని తెగేసి చెప్పారు. దీంతో బహిరంగంగా లంచం ఇస్తానని మాంఝీ అంటున్నారని విపక్షాలు విరుచుకుపడ్డాయి. విశ్వాస పరీక్ష నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై గుర్రుమన్నాయి. శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న మాంఝీ సీఎంగా కొనసాగాలంటే 117 మందికి పైగా శాసన సభ్యుల మద్దతు అవసరం ఉంది. అందుకే ఆయన మంత్రిపదవులు ఎరవేసి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.