జైషే కమాండర్ నూర్ మొహమ్మద్ తాంత్రే అలియాస్ చోటా నూరా (ఫైల్ ఫొటో)
శ్రీనగర్ : జైషే ఈ మొహమ్మద్(జేఈఎమ్) ఉగ్రవాద సంస్థలో టాప్ కమాండర్‌గా ఉన్న నూర్ మహమ్మద్ తాంత్రే అలియాస్ చోటా నూరా(47)ను మంగళవారం తెల్లవారుజామున భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కేవలం మూడు అడుగులు మాత్రమే ఎత్తుండే నూర్ జైషే కమాండర్‌గా కశ్మీర్‌లోని భద్రతా దళాలకు నిద్ర లేకుండా చేశాడు.
నూర్ స్వస్ధలం కశ్మీర్ లోయలోని త్రాల్ ప్రాంతం. శ్రీనగర్ అంతర్జాతీయ విమానశ్రయం వద్ద గల బీఎస్‌ఎఫ్ క్యాంప్‌పై దాడి, ఉడి ఉగ్రదాడి వెనుక నూర్ హస్తం ఉన్నట్లు రిపోర్టులు ఉన్నాయి. గత ఇరవై ఏళ్లలో భద్రతా బలగాలపై జరిగిన అత్యంత శక్తిమంతమైన దాడిగా ఉడి ఉగ్రదాడి గుర్తింపు పొందింది. 2015లో జైషేలో చేరిన నూర్‌కు ఆ తర్వాత కశ్మీర్ పరిసరాల్లో జరిగిన ప్రతి ఉగ్ర చర్యకు సంబంధాలు ఉన్నాయి.
మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో నూర్ హతమార్చడంపై భద్రతా బలగాలు ఆనందం వ్యక్తం చేశాయి. కశ్మీర్‌లో లోయలో ఆర్మీకి పెద్ద తలనొప్పి వదిలిందని పేరు తెలపడానికి ఇష్టపడిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. శ్రీనగర్ - జమ్మూ హైవేపై వెళ్తున్న భద్రతా బలగాల కాన్వాయ్‌పై ఉగ్రదాడికి నూర్ వచ్చిన సమయంలో హతమార్చినట్లు జమ్మూ కశ్మీర్ డీజీపీ తెలిపారు. ఇంటిలిజెన్స్ సమాచారం ద్వారానే నూర్‌ను హతమార్చగలిగామని వెల్లడించారు.
నూర్‌ను 2003లో ఉగ్రవాద నిరోధిత చట్టం(పీఓటీఏ) కింద అరెస్టు చేసినట్లు చెప్పారు. కోర్టు అతనికి జీవిత ఖైదును విధించిందని వివరించారు. అయితే, 2015లో పేరోల్‌పై బయటకు వచ్చిన అతను జైషేతో చేతులు కలిపాడని వెల్లడించారు. గత మూడు నెలల్లో 15 మంది జైషే ముఖ్యనేతలను మట్టుబెట్టామని చెప్పారు. డిసెంబర్, జనవరి నెలల్లో జైషే సంస్థ ఎక్కువగా దాడులకు పాల్పడుతూ వస్తోందని తెలిపారు. కీలకమైన ఈ రెండు నెలల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment