
భోపాల్: భానుడి భగభగలను సైతం లెక్కచేయక కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకున్న నీళ్లు చోరీకి గురవడం ఆ గ్రామస్తులను ఆవేదనకు గురి చేసింది. దీంతో నీళ్లు నింపిన డ్రమ్ములకు తాళం వేసి ఒక్కో నీటి బిందువును ఎంతో జాగ్ర్తత్తగా కాపాడుకుంటున్నారు. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా ఝాన్సార్ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో నీటి సంక్షోభం ఏర్పడింది. దీంతో ఆ గ్రామ ప్రజలు దాదాపు మూడు కిలోమీటర్ల నుంచి నీళ్లు మోసుకువస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇలాంటి కష్టమేమీ పడకుండానే పక్క వాళ్ల నీళ్లు కొట్టేసి.. అవసరాలు తీర్చుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో నీటి దొంగలకు చెక్‌పెట్టాలనుకున్న బాధితులు.. డ్రమ్ములకు తాళం వేయడం ప్రారంభించారు. ఈ విషయం గురించి గ్రామస్తులు మాట్లాడుతూ.. ‘‘ మా గ్రామంలో నీటి కొరత ఉంది. ఎంతో దూరం నడిచి నీళ్లు తెచ్చుకుంటే కొంతమంది వాటిని దొంగలిస్తున్నారు. అందుకే ఈ పని చేశాం’’అని చెప్పుకొచ్చారు. ఇక గ్రామ ప్రజల సమస్యను జిల్లా ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్‌ఎస్ భిడే దృష్టికి తీసుకువెళ్లగా... ‘‘ వేసవిలో జిల్లాలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. చేతిపంపులు పనిచేయడం లేదు. వాటిని బాగు చేయించి.. ప్రజల సమస్యలు తీరుస్తాం’’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment