సమైక్య మహారాష్ట్రే మా నినాదం
గడ్కరీ వ్యాఖ్యలపై శివసేన నేత సంజయ్ రావుత్
ముంబై: సమైక్య మహారాష్ట్రే శివసేన నినాదమని ఆ పార్టీ నేత సంజయ్ రావుత్ స్పష్టం చేశారు. ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటుకు తాము వ్యతిరేకమని, అందుకు ప్రజల మద్దతు కూడా లేదని రావుత్ పేర్కొన్నారు. విదర్భ ఏర్పాటు కావాలంటే పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరమని, ఇతర పార్టీల మద్దతు కూడా కూడగట్టాల్సి ఉందని కేంద్ర నౌకాయాన మంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై రావుత్ పైవిధంగా స్పందించారు.
మరాఠీ మాట్లాడే ప్రజలందరిని మోడీ సర్కారు ఏకం చేస్తుందని తాము బలంగా విశ్వసిస్తున్నామని, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బెల్గావ్‌ను కూడా మహారాష్ట్రలో కలపేందుకు మోడీ సర్కారు సహాయసహకారాలు అందిస్తుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. అఖండ మహారాష్ట్రకే శివసేన కట్టుబడి ఉందని, విదర్భను మహారాష్ట్ర నుంచి వేరు చేయడాన్ని శివసేన ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదన్నారు.