నేనంటే.. నేను
ఓటమి బాధ్యత తీసుకునేందుకు ముందుకు వచ్చిన సోనియా, రాహుల్, మన్మోహన్
రాజీనామాలకు సిద్ధపడ్డపార్టీ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు
తిరస్కరించిన సీడబ్ల్యూసీ
{పభుత్వం, పార్టీ.. రెండింటిదీ బాధ్యత అని తీర్మానం
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి బాధ్యత తీసుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు నేనంటే.. నేనంటూ పోటీలు పడ్డారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. పార్టీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామాలకు సిద్ధపడగా.. ప్రభుత్వాధినేతగా ఆ బాధ్యత తనదంటూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ముందుకొచ్చారు. అయితే, సోనియా, రాహుల్‌ల రాజీనామాలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే, పార్టీని దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో బలోపేతం చేసేలా పునర్వ్యవస్థీకరించే బాధ్యతలను పార్టీ అధ్యక్షురాలైన సోనియాగాంధీకి అప్పగిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించింది.
కాంగ్రెస్ సందేశం ప్రజలకు చేరలేదు
లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సాయంత్రం 4.30 నుంచి రాత్రి 7 గంటల వరకు సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. మొత్తం 41 మంది సీడబ్ల్యూసీ సభ్యులకు గాను 38 మంది హాజరయ్యారు. రాష్ట్రాల వారీగా వైఫల్యాలను ఈ సమావేశంలో చర్చించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపైనే చర్చ జరిగింది. సమావేశంలో తొలుత సోనియాగాంధీ ప్రారంభ ప్రకటన చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశాజనకంగా వచ్చాయి. అయితే మనం కలత చెందరాదు. లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ సందేశాన్ని ప్రజలకు వినిపించేందుకు గత కొన్ని నెలలుగా తీవ్రంగా శ్రమించారు. వాళ్లందరినీ నేను అభినందిస్తున్నా. అభ్యర్థులు కూడా కష్టాలను ఓర్చి నిలబడ్డారు. వీరిలో కొందరు విజయం సాధించారు. వారందరికీ నా అభినందనలు. పదేళ్లు పాలించినప్పుడు ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడం సహజం. ప్రత్యర్థుల పదునైన దుష్ర్పచారంలో కాంగ్రెస్ సందేశం ప్రజలకు చేరలేదు. పైగా వాళ్లకు అపరిమిత వనరులు ఉన్నాయి. మన వ్యతిరేక మీడియా వారి వెన్నంటి ఉంది. అయితే ఫలితాలపై మనం సమీక్ష జరుపుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనకు అండగా ఉన్న వర్గాలు ఎందుకు మనతో రాలేదో అధ్యయనం చేయాలి. యువత ఆకాంక్షలకు అనుగుణంగా మనల్ని మనం మలుచుకున్నామా? సమాజంలో మార్పుకు అనుగుణంగా పనిచేశామా? ప్రభుత్వం, పార్టీ పరంగా మన విజయాలను ప్రచారం చేసుకోలేకపోయామా? ఇవన్నీ నన్ను నేను ప్రశ్నించుకున్నా. వీటిని మనం క్షేత్రస్థాయి నుంచి అన్ని స్థాయిల్లో అడగాల్సిన ప్రశ్నలు. మన్మోహన్‌సింగ్ పదేళ్లపాలన ప్రశంసించదగినది. సంకీర్ణ ప్రభుత్వం, ఆర్థిక మాంద్యం.. ఇలా అనేక అంశాల నేపథ్యంలో పదేళ్లు పాలించడం ప్రశంసనీయం. పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన మార్పులను నేను చేయలేకపోయాను. అందుకు నేను సంపూర్ణ బాధ్యత తీసుకుంటూ నా పదవిని వదులుకోవడానికి సిద్ధమయ్యాను’ అని పేర్కొన్నారు.
సరైన సమయంలో స్పందించలేదు: మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ.. ‘ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, అవినీతి వంటి వాటికి ప్రభుత్వం సరైన సమయంలో పరిష్కారం చూపలేదని నాకనిపించింది. సోనియాగాంధీ ఎంతో శ్రమించారు. పార్టీ అభ్యున్నతికి నిరంతరం కృషిచేశారు. మీరు పదవిని వదులుకోవడం సమస్యకు పరిష్కారం కాదు. ఓటమికి నేను బాధ్యత తీసుకుంటున్నాను’ అన్నారు. అనంతరం రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం పదేళ్లు బాగా పనిచేసింది. అయితే పార్టీలో ఉండాల్సిన స్థాయిలో జవాబుదారీతనం లేదనిపిస్తోంది. నా మీద ఉన్న బాధ్యత కూడా నేను పూర్తిస్థాయిలో నిర్వర్తించలేకపోయాను. అందువల్ల జవాబుదారీగా నా పదవికి రాజీనామా చేస్తున్నాను’ అన్నారు. అయితే, రాజీనామాలు అవసరం లేదని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. అత్యున్నతస్థాయి కమిటీగా ఓటమికి సమష్టి బాధ్యత తీసుకోవాలని, ప్రభుత్వం, పార్టీ రెండూ కూడా ఓటమికి బాధ్యత వహించాలని పేర్కొంది. అలాగే, ఇటీవల మరణించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.జనార్దన్‌రెడ్డికి సంతాపం ప్రకటిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది.
త్వరలో కమిటీ
ఎన్నికల్లో పార్టీ అనుసరించిన వ్యూహాలను సమావేశంలో పలువురు విమర్శించారు. మునుపెన్నడూ లేని విధంగా మత ప్రాతిపదికన ఓట్లు చీలాయని మరికొందరు విశ్లేషించారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ కోసం రాజీనామాలు చేసేందుకు కొందరు ప్రధాన కార్యదర్శులు సిద్ధపడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్, సోనియాల రాజీనామాలను తొలుత అజిత్‌జోగీ వ్యతిరేకించగా, ఆయనకు మద్దతుగా గులాం నబీ ఆజాద్, అనిల్ శాస్త్రీ నిలిచారు. పార్టీ పరాజయంపై విశ్లేషణ జరిపేందుకు ఒక కమిటీని త్వరలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.