సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టేనని, దానిని నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. మంగళవారం ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు పోలవరం సత్వర నిర్మాణ ఆవశ్యకతను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మంత్రి తక్షణం ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో దినేష్‌కుమార్, జలవనరుల శాఖ కార్యదర్శి తదితర అధికారులు కూడా పాల్గొన్నారు. అథారిటీకి కేవలం సీఈవోను నియమించారని, పూర్తిస్థాయిలో అథారిటీ ఏర్పాటుకాలేదని హరిబాబు మంత్రికి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరగడానికి నిధుల కొరతే కారణమన్నారు.
ప్రాజెక్టు పూర్తయ్యేందుకు రూ.16 వేల కోట్లు అవసరం కాగా.. కేవలం రూ.100 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మంత్రి ఉమాభారతి బదులిస్తూ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీని పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసి త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని, తగిన కార్యాచరణ రూపొందించి ప్రాజెక్టును నిర్దిష్ట సమయంలో పూర్తిచేసేలా అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు.