తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌తో ప్రజలకు మేలు చేద్దాం
సహకరించాలని అఖిలపక్షానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి
పత్రాల లీకేజీ, ఇతర అంశాలపై ఆందోళన వ్యక్తంచేసిన పార్టీలు
{పతిపక్షాలతో విభేదాలను పరిష్కరించుకుంటామని వెంకయ్య వెల్లడి
సోనియా నివాసానికి వెళ్లి బడ్జెట్‌కు సహకరించాలని విజ్ఞప్తి
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను విజయవంతం చేయాలని అఖిలపక్ష పార్టీలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌తో సామాన్యుడికి ప్రయోజనం చేకూరేలా అన్ని పార్టీలు పార్లమెంట్ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బడ్జెట్‌పై ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, వాటిని నెరవేర్చే దిశగా ఉభయసభలు సజావుగా సాగేందుకు పార్టీలన్నీ సహకరించాలని విన్నవించారు. సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం ఆయన ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో అన్ని రాజకీయపార్టీల నేతలు పాల్గొన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలకు తగిన సమయం ఇస్తామని, ప్రాధాన్యాలవారీగా చర్చకు స్వీకరిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. పార్లమెంట్‌ను సజావుగా నడపడం అందరి సమష్టి బాధ్యతగా పేర్కొన్నారు. అప్పుడే సగటు వ్యక్తి ఆశలను నెరవేర్చేందుకు అవకాశం లభిస్తుందన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టనున్న 44 అంశాల ఎజెండా వివరాలను నేతలందరికీ వెంకయ్య వివరించారు. ఈ భేటీలో ఉభయసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 42 మంది వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. అఖిలపక్షంతో గంటపాటు భేటీ అయిన మోదీ అనంతరం నేతలందరితో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, ఆర్జేడీ తరఫున ఒక్కరూ ఈ సమావేశంలో పాల్గొనలేదని ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఈ భేటీకి ముందే వెంకయ్య స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసానికి వెళ్లి ఆమెను కలిశారు. పార్లమెంట్ కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. పెండింగ్ బిల్లులన్నీ ఆమోదం పొందేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు వెంకయ్య మీడియాకు తెలిపారు.
పలు అంశాల ప్రస్తావన..
అఖిలపక్షంలో పలు అంశాలపై నేతలంతా ఆందోళన వ్యక్తం చేశారు. చమురు శాఖలో పత్రాల లీకేజీ వ్యవహారాన్ని పార్టీలన్నీ తీవ్రంగా పరిగణించాయి. ప్రభుత్వానికి సంబంధించిన కీలక పత్రాలు లీక్ కావడం, అందులో ఆర్థిక మంత్రి ప్రసంగించే బడ్జెట్‌లోని అంశాలు కూడా ఉండటంపై ఆందోళన వ్యక్తంచేశాయి. పెట్టుబడిదారీ వ్యవస్థే అధికారం చెలాయిస్తోందనడానికి ఈ కుంభకోణమే నిదర్శనమని జేడీయూ అధినేత శరద్‌యాదవ్ మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రతిపాదిత భూ సేకరణ చట్టంపైనా పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలతో చర్చించి పరిష్కారం కనుగొంటామన్నారు. భూ సేకరణ ఆర్డినెన్స్ విషయంలో తప్ప మరో ఐదు ఆర్డినెన్స్‌ల ఆమోదంపై మాత్రం ఏకాభిప్రాయం కుదిరిందన్నారు.
క్రికెటర్ల క్రమశిక్షణ కావాలి:స్పీకర్
లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా ఆదివారం అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలని కోరారు. చట్టసభ సభ్యులు భారత క్రికెటర్ల క్రమశిక్షణను అలవర్చుకొని సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మన క్రికెటర్లు బాధ్యతాయుతంగా, చక్కని సమన్వయంతో వ్యవహరించి విజయం సాధించారని, ఇదే స్ఫూర్తిని ఎంపీలు అందిపుచ్చుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
అఖిలపక్షంలో క్రికెట్ ఫీవర్
ఉభయసభల్లో వాడీవేడి చర్చలు సాగనున్న తరుణంలో జరిగిన అఖిలపక్ష భేటీలో సుహృద్భావ వాతావరణం నెలకొంది. అన్ని పార్టీల నేతలంతా సరదాగా గడిపారు. ఈ భేటీలో క్రికెట్ ఫీవర్ కూడా కనిపించింది. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ స్కోరును తెలుసుకునేందుకు పలువురు నేతలు ఉత్సుకత చూపారు. మంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా ఎప్పటికప్పుడు స్కోరును వెల్లడించ డం విశేషం. ఇటీవల రాజ్యసభకు తిరిగి ఎన్నికైన కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్‌కు వెంకయ్య అభినందనలు తెలిపారు. రాజ్యసభలో బీజేపీకి తక్కువ బలమున్న నేపథ్యంలో అక్కడున్న నేతలంతా దీనిపై చురుక్కులు-చమక్కులు విసురుకున్నారు.
సామాన్యుడి ఆశలు నెరవేరుద్దాం
Published Mon, Feb 23 2015 2:57 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
Advertisement
Advertisement