
దావూద్ నుంచి భారత నేతకు ఫోన్లు!
ముంబై: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి రోజుకో ఆసక్తికర వార్త బయటకి వస్తోంది. ఇప్పటికే గ్యాంగ్రెయిన్ వ్యాధితో దావూద్ ప్రాణం మీదకు తెచ్చుకున్నాడంటూ వార్తలు షికారు చేస్తుండగా తాజాగా మరో ముఖ్య విషయం వెలుగుచూసింది. పాకిస్థాన్ లోని కరాచీలో దావూద్ ఉంటున్న ఇంటి నుంచి భారత్‌కు తరచుగా ఫోన్ కాల్స్ వస్తున్నాయనేది ఆ వార్తల సారాంశం. అందులో మరాఠాకు చెందిన ఓ కీలక నేతకు కూడా దావూద్ ఇంటి నుంచి కాల్స్ వెళ్లాయని తెలుస్తోంది.
వడోదరాకు చెందిన మనీష్ భాంగలే అనే ఎథికల్ హ్యాకర్ ఈ సమాచారాన్ని బయటికి తీసి ఇండియాటుడేకు అందజేశారు. కరాచీలోని దావూద్ ఇంట్లో 4 ల్యాండ్‌లైన్ ఫోన్లు ఉన్నాయి. ఐతే అవేవీ దావూద్ పేరిట లేవు. ఆయన భార్య మహేజబీన్ షేక్ పేరు మీదనే ఫోన్ కనెక్షన్‌లు తీసుకున్నారు. ఇక భాంగలే తన పార్టనర్ జయేశ్ షాతో కలసి పాకిస్థాన్ టెలికాం కార్పొరేషన్ లిమిటెడ్ సైట్‌ను హ్యాక్ చేసి దావూద్ ఫోన్ కాల్స్‌ను పరిశీలించారు. 2015 సెప్టెంబర్ 5 నుంచి 2016 ఏప్రిల్ 5వ తేదీ మధ్య 7 నెలల కాల్‌డేటాను రాబట్టారు.
ఇక 4 నెంబర్లలో ఒక నెంబర్ నుంచి తరచుగా డయల్ చేసిన 10 అంతర్జాతీయ నెంబర్లను ఇండియాటుడే విశ్లేషించింది. అందులో 5 నెంబర్లు భారత్‌కు, 4 దుబాయ్‌కి చెందినవి. ఒకటి బ్రిటన్‌లోని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకుకు చెందిందని తేలింది. భారత్ నెంబర్లలో ఒకటి ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన మహారాష్ట్ర నాయకుడిది కావడం ప్రకంపనలు రేపుతోంది.