ఏం మాట్లాడుతున్నారు.. షటప్!
ఏం మాట్లాడుతున్నారు.. షటప్!
Published Fri, Dec 2 2016 11:40 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
పెద్దల సభలో గందరగోళం చెలరేగింది. పశ్చిమబెంగాల్‌లో సైన్యం మోహరింపు విషయమై మొదలైన వివాదం చివరకు సభ్యులు తీవ్ర పదజాలం ఉపయోగించేవరకు వెళ్లింది. టీఎంసీ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ దీనిపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతున్నప్పుడు.. అధికార పక్షం నుంచి వ్యాఖ్యలు వినిపించడంతో ఆయన ఆవేశం పట్టలేకపోయారు. ''వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్.. షటప్, షటప్'' అంటూ అధికారపక్షం మీద తీవ్రంగా మండిపడ్డారు. ఇదేమైనా జాతీయ అత్యవసర పరిస్థితా అని ప్రశ్నించిన రాయ్.. మంత్రి సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా తీవ్రంగానే స్పందించారు. సైన్యం ఇలా వెళ్లడం ఇదేమీ మొదటిసారి కాదని, గత సంవత్సరం కూడా ఇదే సమయంలో అదే రాష్ట్రానికి వెళ్లిందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో కూడా ఇలాగే జరుగుతోందని అన్నారు. అంతకుముందు కూడా ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తనను కూడా మాట్లాడనివ్వకపోవడంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఆగ్రహానికి గురయ్యారు.. 'మీకే కాదు, నాకు కూడా కోపం వస్తుంది. మీరు నన్నే మాట్లాడనివ్వనంత సాహసం చేస్తారా, సీనియర్ సభ్యులైనా కూడా ఇలా చేస్తే నేను చర్యలు తీసుకోవాల్సి వస్తుంది' అని గట్టిగా చెప్పారు.
Advertisement