ఆ 56 అంగుళాల ఛాతి బలం ఎక్కడ?
పాట్నా:ప్రధాని నరేంద్ర మోదీపై బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు. కశ్మీర్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జెండాలు ఎగురువేస్తుంటే మోదీ ఛాతి బలం ఎక్కడకెళ్లిందని తీవ్రంగా విమర్శించారు. గత సాధారణ ఎన్నికల్లో తన ఛాతి బలాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన మోదీ.. పాకిస్తాన్, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జమ్మూ కళ్మీర్ లో జెండాలు ఎగురవేస్తుంటే ఏమి చేస్తున్నారని నిలదీశారు. 'మోదీజీ ఇప్పుడు మీకు ఏమైంది?, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై చర్యలు ఏవి?, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారా?, ఆ 56 అంగుళాల ఛాతి బలం ఎక్కడ?అని నితీష్ ప్రశ్నించారు.
గత రెండు రోజుల క్రితం జమ్ము కాశ్మీర్లో హురియత్ మద్దతుదారులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. శ్రీనగర్లోని ఓ మసీదు వద్ద ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగరేశారు. అలాగే జమ్ములోని కుప్వారా జిల్లాతో పాటు కశ్మీర్లో కూడా పాకిస్థానీ జెండాలు మళ్లీ కనిపించాయి. హురియత్ నాయకుడు మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ మద్దతుదారులు ఇస్లామిక్ స్టేట్ జెండాలను జమామసీదు సమీపంలో ఎగరేశారు. ఇంతకుముందు పలు సందర్భాల్లో పాకిస్థానీ, లష్కరే తాయిబా జెండాలు కూడా కశ్మీర్ లోయలో కనిపించినా.. ఇస్లామిక్ స్టేట్ జెండాలు కనిపించడం మాత్రం ఇదే మొదటిసారి కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.