సాక్షి, న్యూఢిల్లీ : ముంబై నగరంలో గత రెండేళ్ల కాలంలో ఆరు రైల్వే వంతెనలు కూలిపోయాయి. వాటిలో మూడు వంతెనల ప్రమాదాల్లో పలువురు ప్రయాణికులు మరణించారు. గురువారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్‌లోని పాదాచారుల వంతెనపై ఓ భాగం హఠాత్తుగా కూలిపోవడంతో ఆరుగురు మరణించడం, 30 మంది గాయపడడం తెల్సిందే. 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన పరిస్థితి ఎలా ఉందో అన్న విషయమై ‘బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్’ ఆరు నెలల క్రితమే అధ్యయనం జరిపి ‘ఇప్పట్లో ఈ వంతెనకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ప్రయాణికులు ఈ వంతెనను నిర్భయంగా ఉపయోగించుకోవచ్చు’ అంటూ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది.
(కూలిన ‘కసబ్’ బ్రిడ్జి)
ఇప్పుడు ఈ వంతెన కూలినందుకు ‘మీరు బాధ్యులంటే మీరు బాధ్యులు’ అంటూ స్థానిక రైల్వే సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది నిందలు వేసుకుంటున్నారు. ‘వంతెన నిర్వహణ బాధ్యత మీదంటే మీదే కనుక మీరే బాద్యులు’ ఇరు వర్గాలు దూషించుకుంటుంటే, మరోపక్క వంతెనకు ఎలాంటి ప్రమాదం లేదంటూ మున్సిపాలిటీ ఎలా ‘ఆడిట్ సర్టిఫికెట్’ ఇచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క ముంబై నగరంలోనే ఇన్ని ప్రమాదాలు జరిగి ఇంత మంది చనిపోయినా పాలకులకు బుద్ధి రాలేదా? అంటూ సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం, మున్సిపాలిటీపై బిజేపీ మిత్రపక్షమైన శివసేన ఆధిపత్యం కొనసాగుతున్న విశయం తెల్సిందే. ఈ వంతెనల ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
కేవలం 18 నెలల క్రితమే
పరేల్స్ ప్రతిభాదేవి రైల్వే స్టేషన్‌లోని పాదాచారుల వంతెనపై తొక్కిసలాట జరిగి 23 మంది ప్రయాణికులు మరణించారు. ఆ తర్వాత జూలై మూడవ తేదీన అంధేరి రైల్వేస్టేషన్‌లో తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలిపే పొడువైన వంతెనలో ఓ భాగం కూలిపోగా ఓ మహిళ మరణించారు. దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పురాతన వంతెనల మరమ్మతులను ఎందుకు చేపట్టడం లేదని సోషల్ మీడియా తీవ్రంగా నిలదీసింది. ముఖ్యంగా బీజేపీ అధికార ప్రతినిధి సంజూ వర్మ ‘టైమ్స్ నౌ’ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ వంతెన ప్రమాదం ‘ప్రకృతి వైపరీత్యం’గా అభివర్ణించడాన్ని, కూలిపోవడంలో పాదాచారుల తప్పిదం ఉందనడాన్ని మరింత ఎండగట్టింది. సంజూ వర్మ సిగ్గూ శరం ఉందా ? అంటూ విమర్శించింది. ‘ఇంకా నయం జవహర్ లాల్ నెహ్రూ బాధ్యుడని చెప్పలేదు’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment