
సివిల్ సర్వీసెస్ అర్హత పరీక్ష వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 32 ఏళ్ల నుంచి 27 ఏళ్లకు తగ్గించాలని నీతి ఆయోగ్ సూచించిన విషయం చర్చనీయాంశంగా మారింది. నిజానికి బీఎస్ స్వాన్ కమిటీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు 2016 ఆగస్టు 9న సమర్పించిన నివేదికలో సివిల్ సర్వీసెస్ అర్హత పరీక్షలకు వయోపరిమితిని 26 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదిస్తూ.. సివిల్స్ పరీక్ష పద్ధతిలో కొన్ని మార్పులను సూచించింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం ఇప్పుడున్న 37 సంవత్సరాల వయోపరిమితిని కొనసాగించాలని పేర్కొంది. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్‌స్కూల్ ఆఫ్ బిజినెస్, యూసీ బెర్క్‌లీ హౌస్ స్కూల్ ఆఫ్ బిజినెస్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సివిల్ సర్వీసెస్‌పై తాజా అధ్యయనం చేశాయి. అర్హత ప్రవేశ పరీక్షకు వయోపరిమితి తగ్గించడం వల్ల అధికారుల సేవలను ఎక్కువగా వినియోగించుకునే అవకాశాన్ని నొక్కి చెప్పాయి.
ఎక్కువ వయసులో సివిల్ సర్వీసెస్‌లోకి అడుగు పెట్టిన వారికి పదోన్నతిలో అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు సివిల్ సర్వీసెస్‌లో అత్యున్నత పదవి అయిన చీఫ్ సెక్రటరీ, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా చేరుకునేందుకు కనీసం పాతిక నుంచి 30 ఏళ్ల సర్వీస్ ఉండాలి. ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్ల లోపే ఇదంతా జరగాల్సి ఉంటుంది. కానీ 30 ఏళ్లకో, 32 ఏళ్లకో ఉద్యోగంలోకి వచ్చే వ్యక్తికి ఆ పదవి చేరుకునే అవకాశమే ఉండదు. సివిల్ సర్వీసెస్‌లో చేరే నాటికి వారి వయసును బట్టి వారి పనితీరు సామర్థ్యంలోనూ వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ వయసులో సివిల్ సర్వీసెస్ ఉద్యోగంలో చేరిన వారు ఆ రంగంలో అత్యున్నత వేతనాన్ని అందుకుంటున్న పరిస్థితులు తక్కువగా ఉన్నాయి.
22 ఏళ్లకే సివిల్స్ రంగంలోకి అడుగిడిన వారిలో దాదాపు 80 శాతం మంది చీఫ్ సెక్రటరీగా రిటైర్ అవుతున్నారు. అయితే 29–30 ఏళ్ల మధ్య సర్వీస్‌లోకి ప్రవేశించిన వారికి మాత్రం ఈ అవకాశమే లేదని తెలుస్తోంది. ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారనేది ఏ వయసులో విధుల్లో చేరుతున్నారనేదానిపై కూడా ఆధారపడి ఉంటుందని తేల్చారు. దీంతో సివిల్ సర్వీసెస్ అర్హత పరీక్షకు అంతిమ వయ సు 27 ఏళ్లకు తగ్గించాలన్న అభిప్రాయానికి కారణమయ్యాయి. ఈ మార్పుల వల్ల ఎక్కువ మందికి అత్యున్నత హోదాకు చేరుకునే అవకాశం ఉంటుందన్నది పలువురి వాదన. అలాగే ఈ మార్పులో దళితులకు, ఆదివాసీలకు ఐదేళ్ల మినహాయింపు కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment