సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా పశ్చిమ బెంగాల్ గంగ్నాపూర్ లో 72 ఏళ్ల నన్పై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల్ని అరెస్టు చేయకపోవడంపై జాతీయ మహిళా కమిషన్ మండిపడింది. సీసీ టీవీ కెమెరాల్లో నిందితులు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది.
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు షమీనా సఫియా నేతృత్వంలోని బృందం శనివారం గంగ్నాపూర్లో పర్యటించింది. 'నేరం జరిగి వారంరోజులు కావాస్తోంది. సీసీ టీవీల్లో నిందితుల తాలూకు ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా సరే అవసరమైనమేరకు పోలీసులు స్పందించకపోవటం దారుణం' అని సఫియా మీడియాతో అన్నారు.
ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటన జరిగినాడే ప్రకటించారు. అయితే సీబీఐ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందనను వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ఎలాగూ కేసు సీబీఐ చేతికి వెళ్తుందనే ఉద్దేశంతో స్థానిక పోలీసులు దర్యాప్తుపై దృష్టిసారించట్లేదు. దీంతో నిందితులు తప్పించుకు తిరిగే అవకాశాన్ని స్వయంగా పోలీసులే కల్పిస్తున్నట్లయింది.
మార్చి 13 అర్ధరాత్రి స్కూల్ లోకి చొరబడ్డ పన్నెండుమంది దొంగలు నన్ పై సామూహిక లైంగికదాడిచేయడంతోపాటు రూ.12 లక్షలు దోచుకెళ్లారు. చికిత్స అనంతరం శుక్రవారం ఆసుపత్రినుంచి డిశ్చార్జి అయిన నన్.. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లారు.
నన్ రేప్ కేసులో అరెస్టులేవి?
Published Sat, Mar 21 2015 6:05 PM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM
Advertisement
Advertisement