మీవాళ్లు తప్ప ఎవరూ పనికిరారా? | Why only BJP leaders become governors, asks Shiv Sena | Sakshi
Sakshi News home page

మీవాళ్లు తప్ప ఎవరూ పనికిరారా?

Published Fri, Aug 19 2016 4:27 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

మీవాళ్లు తప్ప ఎవరూ పనికిరారా? - Sakshi

మీవాళ్లు తప్ప ఎవరూ పనికిరారా?

వివిధ రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం తీరును శివసేన తప్పుబట్టింది. కేవలం బీజేపీ మాజీ నేతలు తప్ప వేరెవరూ గవర్నర్లుగా పనికిరారా అని ప్రశ్నించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నాయకులను బీజేపీ మర్చిపోయిందని విమర్శించింది. తమతో పాటు తెలుగుదేశం, అకాలీదళ్ లాంటి పార్టీల నేతలు కూడా గవర్నర్ పదవులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ పార్టీలన్నింటిలోనూ చాలామంది సీనియర్ నాయకులున్నారని, రాజ్‌భవన్ పదవి వారికి వస్తుందంటే ఎవరూ వద్దనరని తమ పార్టీ పత్రిక 'సామ్నా'లో రాసిన సంపాదకీయంలో శివసేన తెలిపింది.

అయితే, ఒక్క బీజేపీకే 280 మంది ఎంపీలు ఉండటంతో భాగస్వామ్య పక్షాల అరుపులను ఎవరూ వినరని కూడా ఆ సంపాదకీయంలో చెప్పారు. అసలు గవర్నర్ పదవులనే రద్దుచేయాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయని, రాజ్‌భవన్లు అన్నీ కేవలం పెన్షనర్లు, రిటైరైపోయిన రాజకీయ నాయకుల పునరావాస కేంద్రాలు గాను మారిపోయాయని విమర్శించారు. ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ అస్థిరత ఏర్పడితే.. రాజ్‌భవన్లే మొత్తం రాజకీయం నడిపిస్తున్నాయన్నారు.

పంజాబ్ మణిపూర్ రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు ఉండటంతో అక్కడ కొత్తగా వీపీ సింగ్ బద్నోర్, నజ్మా హెప్తుల్లాలను నియమించారని.. దానివల్ల వారికి అక్కడ రాజకీయ విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందని శివసేన విమర్శించింది. రిటైరైన పోలీసు లేదా సైనికాధికారులను ఆయా పదవుల్లో నియమిస్తే.. మంచి ఫలితాలు వస్తాయని సూచించింది. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం అనుభవజ్ఞుడైన లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్‌ను తీసేసి, ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే జగదీష్ ముఖిని పెట్టారని విమర్శించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement