న్యూఢిల్లీ: వివాహ సంబంధ కేసులు పెండింగ్‌లో ఉండగా భార్యలు భరణం కోరితే భర్తలు.. దివాలా తీశామని, పేదరికంలో బతుకుతున్నామని చెబుతున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. విడాకులు కోరిన హైదరాబాద్‌కు చెందిన ఓ జంట కేసులో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్ గుప్తాల బెంచ్ ఈ విధంగా స్పందించింది. భార్య భరణం కోరిందన్న కారణంతో ఉద్యోగం మానేయొద్దని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న భర్తకు సూచించింది. భార్యకు నెలకు రూ.15 వేల చొప్పున భరణం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
‘ఈరోజుల్లో నెలకు రూ.15 వేలతో పిల్లల బాగోగులు చూసుకోవడం సాధ్యమేనా? భార్యలు భరణం కోరిన వెంటనే.. తాము పేదరికంలో బతుకుతున్నామని, లేదా దివాలాతీశామని భర్తలు చెప్పడం సర్వసాధారణమైంది. మీ భార్య భరణం కోరిందని మీరు ఉద్యోగం మానేయొద్దు’ అని బెంచ్ భర్తకు సూచించింది. ఆ భరణం మొత్తం ఎక్కువని, హైకోర్టు ఉత్తర్వుల్ని కొట్టివేయాలని భర్త తరఫు లాయర్ చేసిన వాదనల్ని తోసిపుచ్చింది. భర్త ప్రముఖ ఆసుపత్రిలో వైద్యుడని, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది. తన భర్తకు నెలకు రూ.80 వేల వేతనంతో పాటు, ఇంటి అద్దె, వ్యయసాయ భూముల రూపంలో మరో 2 లక్షల ఆదాయం వస్తోందని పేర్కొన్న భార్య..నెలకు రూ.1.10 లక్షల భరణం ఇప్పించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment