భార్య కోసం బావినే తవ్వాడు
నాగపూర్ : కొండను తవ్వి రోడ్డును నిర్మించిన 'మౌంటెన్ మ్యాన్' దశరథ్ మాంఝీ గుర్తున్నాడా? దీనిపై మాంఝీ సినిమా కూడా వచ్చింది. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మహారాష్ట్రకు చెందిన బాబూరావు తాంజే మరోసారి నిరూపించాడు. తాగునీటి కో్సం బావి దగ్గరికి వెళ్లిన తన భార్య సంగీతను యజమాని అవమానించడంతో కుమిలిపోయిన దళితుడు తానే స్వయంగా 40 రో్జులు కష్టపడి బావిని తవ్వాడు.
ఇప్పుడు దళితులంతా ఆ బావి నీటిని వాడుతున్నారు. వాషిమ్ జిల్లాలోని కలంబేశ్వర్ కు చెందిన బాబూరావు తాంజే రోజువారీ కార్మికునిగా పనిచేస్తున్నాడు. ప్రతి రోజు తనకూలి పనిచేసుకుంటూనే రోజుకి 4 గంటలు బావి తవ్వడానికి కేటాయించేవాడు. ఇలా ఎవరి సాయం లేకుండా తానే స్వయంగా బావిని తవ్వాడు. ఈ పనిలో అతనికి ఎవరూ సాయపడలేదు. గతంలో తాను తొవ్వుతున్న బావి పక్కనే రెండు బోర్లు వేయగా నీరు రాలేదని తన ప్రయత్నం వృధా అని స్ధానికులు ఎగతాలిచేసినా తాంజే తన ప్రయత్నాన్ని ఆపలేదు.
'తాగు నీటి కోసం వెళ్లిన నా భార్యను బావి యాజమాని అవమానించాడు. మేము పేదవాళ్లం, దళితులం కావడంతోనే మమ్మల్ని అవమానించారు. ఆ రోజంతా మా కుంటుంబ సభ్యులు ఏడుస్తూనే ఉన్నారు. నేనూ బాధ పడ్డాను. వెంటనే దగ్గర్లోని మాలేగావ్ కు వెళ్లి పలుగు,పార కొని బావిని తవ్వే పనిని ప్రారంభించాను. ఈ ప్రాంతంలో తవ్వితే నీరు పడుతుందా, పడదా అని నాకు తెలియదు. దేవుని ప్రార్ధించి పని ప్రారంభించాను' అని తాంజే తెలిపాడు. తన విజయానికి పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు తాంజే.