గ్రామీణాభివృద్ధి మంత్రి గోపీనాథ్ ముండే
పలువురు మంత్రుల బాధ్యతల స్వీకారం
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లోని పలువురు మంత్రులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారి ప్రాధామ్యాలను వివరించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
‘యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునర్వ్యవస్థీకరిస్తాం. గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా ఈ పథకాన్ని రూపొందిస్తాం. ఇటీవల ఆమోదించిన భూసేకరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తాం. ప్రతి ఒక్క కుటుంబానికి పారి శుద్ధ్య వసతులు, తాగునీటి సదుపాయాన్ని కల్పించాలన్న వాగ్దానాన్ని నెరవేర్చేందుకు అత్యధిక ప్రాధాన్యమిస్తాం’
- గోపీనాథ్ ముండే, గ్రామీణాభివృద్ధి శాఖ
‘సాయుధ విభాగాల కోసం ఆధునిక ఆయుధ వ్యవస్థను అందిపుచ్చుకునే ప్రక్రియను వేగవంతం చేస్తాం. అది వివాద రహితంగా ఉండేలా జాగ్రత్తపడతాం. సాయుధ బలగాలకు అవసరమైన ఆధునిక ఆయుధ సామగ్రిని త్వరితగతిన అందించడం మోడీ ప్రభుత్వ ప్రధాన ప్రాధమ్యం. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26% నుంచి పెంచే విషయంపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. ప్రభుత్వ మార్పు ఆర్మీ చీఫ్‌గా లెఫ్ట్‌నెంట్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ నియామకంపై ఎలాంటి ప్రభావం చూపదు’
- అరుణ్ జైట్లీ, ఆర్థిక, రక్షణ శాఖ
‘రైళ్లలో ప్రయాణికుల భద్రతపై ప్రధానంగా దృష్టి సారిస్తాం. రైల్వేల్లో భద్రత, రక్షణ, వేగం.. ఈ మూడు మా ప్రాధమ్యాలు. రైల్వేల అభివృద్ధిపై ప్రధాని నరేంద్రమోడీకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా రోడ్‌మ్యాప్ రూపొందిస్తాం. బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టే విషయంపై ప్రధానితో చర్చిస్తా’
- సదానంద గౌడ, రైల్వే శాఖ
‘ఆహార ధాన్యాల ధరలకు కళ్లెం వేయటం తొలి ప్రాధాన్యం. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ఆహార ధాన్యాల నిల్వకు చర్యలు తీసుకోవడంపై దృష్టి పెడతాం’
- రామ్‌విలాస్ పాశ్వాన్, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ
‘జీడీపీలో 6% విద్యారంగానికి కేటాయించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటివరకు విద్యారంగానికి జీడీపీలో 3.8% మాత్రమే కేటాయిస్తున్నారు. ఉన్నతవిద్యపై రూపొందించిన చట్టాలను పునస్సమీక్షిస్తాం. ఎన్నికల హామీలైన జాతీయ ఈ లైబ్రరీ, హిమాలయన్ సాంకేతికతపై సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు.. మొదలైన వాటి అమలుకు కృషి చేస్తాను’
- స్మృతి ఇరానీ, మానవ వనరుల శాఖ
‘ఆరోగ్య రంగంలో విధాన రూపకల్పనకు, వాటి అమలుకు దేశీయ, విదేశీ నిపుణుల సలహాలు తీసుకుంటాం. పారదర్శకత, ఈ గవర్నెన్స్ మా లక్ష్యాలు’
- హర్షవర్ధన్, ఆరోగ్య శాఖ
‘సీబీఐ విశ్వసనీయతను పునరుద్ధరించేందుకు, దానికి స్వయంప్రతిపత్తి కల్పించేందుకు కృషి చేస్తాను. సీబీఐ సహా అన్ని రకాల సంస్థలు స్వతంత్రంగా పనిచేసి అందరికి న్యాయం చేకూర్చేలా ఉండాలని నా ఉద్దేశం’
- జితేంద్రసింగ్, సిబ్బంది, పీఎంఓ సహాయ మంత్రి
‘పత్రికా స్వేచ్ఛపై మా ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు స్వేచ్ఛ చాలా అవసరం. ఎమర్జెన్సీ కాలంలో మీడియాపై ఆంక్షలు విధించటాన్ని నేను వ్యతిరేకించాను. మాది పాత్రికేయుల కుటుంబం. మీడియాపై ఆంక్షలకు వ్యతిరేకంగా పోరాడి జైలు జీవితం కూడా గడిపాం’
- ప్రకాశ్ జవదేకర్, సమాచార ప్రసార శాఖ
‘ఉపాధి హామీ’ని పునర్వ్యవస్థీకరిస్తాం!
Published Wed, May 28 2014 3:41 AM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM
Advertisement
Advertisement