ఈ సారికి పంటరుణాలుండవా?
ఈ సారికి పంటరుణాలుండవా?
Published Wed, Jun 11 2014 11:09 AM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM
'తాంబూలాలిచ్చేశాం... తన్నుకుచావండి' అన్న రీతిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇరు ప్రభుత్వాలకూ బోలెడన్ని బాలారిష్టాలను వదిలి మరీ వెళ్లింది. ఇద్దరు ముఖ్యమంత్రులూ ప్రమాణ స్వీకారాలైతే చేయగలిగారు కానీ ఆ తరువాత పని ముందుకు సాగడం లేదు. పరిపాలన పడక దిగనంటోంది.
ఇరు రాష్ట్రాలకు ఉన్న అతి ముఖ్యమైన సమస్య ఐఏఎస్ అధికారుల పంపిణీ. ఐఎఎస్ ఆధ్వర్యంలోనే పాలన సాగుతుంది. కానీ వారి కేటాయింపు విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీంతో ఇరు రాష్ట్రాల్లోనూ కీలక నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయి.
ప్రమాణ స్వీకారం తరువాత చంద్రబాబు నాయుడు కొన్ని ఫైళ్లపై సంతకాలు చేయగలిగారు. కానీ ఒక్క ఫైలు కూడా ముందుకు సాగడం లేదు. చంద్రబాబు, ఆయన మంత్రి వర్గం ఒక సమావేశం గుంటూరులో, ఇంకొకటి విశాఖ పట్నంలో ఏర్పాటు చేసి 'సత్యరాజా పూర్వదేశ యాత్రలు' చేస్తున్నారు. కానీ అధికార యంత్రాంగం మాత్రం హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచే పనిచేస్తోంది. చాలా సందర్భాల్లో తెలంగాణకు కేటాయించిన అధికారులు ఇంకా వారికి కేటాయించిన కె, ఎల్ హెచ్ బ్లాకులకు వెళ్లలేదు. ఫైళ్ల విభజన, పని విభజన పూర్తిగా జరగకపోవడంతో ఎవరే రాష్ట్రానికి పనిచేస్తున్నారన్న విషయంలోనూ స్పష్టత రావడం లేదు.
తెలంగాణకు ఇప్పటి వరకూ చేసిన కేటాయింపులన్నీ తాత్కాలికమే. తెలంగాణకు ఇంకా కొందరు అధికారులను కేటాయించాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం 376 మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వీరిని 58:42 నిష్పత్తిలో ఆంధ్ర, తెలంగాణల మధ్య పంచాల్సి ఉంది. అయితే ఈ పంపిణీ చాలా సమయం తీసుకుంటోంది. ఈ జాబితాను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ పూర్తి చేసి, ప్రధానమంత్రి ఆమోదానికి పంపించాల్సి ఉంది. అయితే జాబితా తయారీకే కనీసం నెల పట్టే అవకాశం ఉందని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తరువాత కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయడానికి వీలుండదు.
అంతే ఈ లెక్కన పంట రుణాల ఫైలు కదిలేందుకు కనీసం రెండు నెలలు పడుతుంది. కాబట్టి చంద్రబాబు సంతకం పెట్టినంత మాత్రాన పనేమీ జరగదు. ఈ ఖరీఫ్ పూర్తయిపోయినా రుణాలు చేతికి వచ్చే పరిస్థితి ఉండదు. చంద్రబాబు ఈ జాబితా జాప్యం సాకు చూపించి, తన వైఫల్యం కప్పి పుచ్చుకుని, ఈ సారికి రైతులకు పంట రుణాలు లేకుండా చేయడానికి సిద్ధమౌతున్నారా , కేవలం మాటలతోనే చంద్రబాబు ప్రజలను మభ్యపెడతారా అన్నది అసలు ప్రశ్న!
Advertisement