న్యూఢిల్లీ: వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఉపసంహరించాలంటూ జస్టిస్ బి.పి. జీవన్‌రెడ్డి కమిటీ చేసిన సిఫార్సును తోసిపుచ్చాలంటూ కేంద్ర హోంశాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ప్రధాని మోదీ సారథ్యంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీకి నివేదిక పంపినట్లు హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ చట్టాన్ని నీరుగార్చేందుకు వీల్లేదన్న రక్షణశాఖ...తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న భద్రతా దళాలకు వేధింపుల నుంచి ఈ చట్టం రక్షణ కల్పిస్తుందని పేర్కొంది.
అస్సాం రైఫిల్స్ కస్టడీలో ఉండగా తాంగ్‌జిం మనోరమ అనే మహిళ హత్యకు గురికావడం... తమ రాష్ట్రంలో ఈ చట్టాన్ని ఉపసంహరించాలంటూ మణిపూర్ హక్కుల కార్యకర్త ఇరోం షర్మిల ఆమరణ నిరాహారదీక్షకు దిగడం...దీనిపై ఆ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తీవ్ర రూపు దాల్చడంతో 2004లో అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.పి. జీవన్‌రెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఏఎఫ్‌ఎస్‌పీఏ అమలు తీరును అధ్యయనం చేసిన జీవన్‌రెడ్డి కమిటీ...ఈ చట్టం అణచివేతకు చిహ్నంగా మారిందని, వివక్షకు, ఆధిపత్య ధోరణికి పనిముట్టుగా మారిందని పేర్కొంటూ దీన్ని ఉపసంహరించాలని 2005 జూన్ 6న సమర్పించిన నివేదికలో కేంద్రానికి సిఫార్సు చేసింది.
ఏఎఫ్‌ఎస్‌పీఏ ‘రద్దు’ను తోసిపుచ్చండి
Published Tue, Mar 3 2015 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM
Advertisement