లక్నో: కేంద్ర హోంశాఖ మాజీ సహాయమంత్రి స్వామి చిన్మయానంద్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నాటి నుంచి కనిపించకుండా పోయినా షాజహన్‌పూర్ లా విద్యార్థిని ఆచూకీ లభ్యం అయ్యింది. వారం రోజుల నుంచి కనిపించకుండా పోయినా యువతి రాజస్తాన్‌లో ప్రత్యక్షం అయ్యింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. యువతి క్షేమంగా ఉందని తెలిపారు. యువతి తన ఇష్టం మేరకే ఇంటి నుంచి వెళ్లి పోయిందన్నారు. ఆమెను రాజస్తాన్‌లో గుర్తించామని తెలిపారు. ఆమెతో పాటు మరో స్నేహితురాలు కూడా ఉందన్నారు. ఈ కేసులో తదుపరి విచారణను ప్రారంభిస్తామని తెలిపారు.
వారం రోజుల క్రితం షాజహన్‌పూర్‌కు చెందిన సదరు లా విద్యార్థిని స్వామి చిన్మయానంద్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సంత్ సమాజ్‌కు చెందిన ఓ పెద్దమనిషి చాలా మంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేశాడని.. తనను కూడా చంపడానికి ప్రయత్నించాడని ఆరోపించింది. తనను కాపాడాల్సిందిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను, ప్రధాని నరేంద్ర మోదీని ఫేస్‌బుక్ లైవ్‌లో కోరింది. ఆ తర్వాత నుంచి సదరు యువతి కనిపించకుండా పోయింది. ఈ వీడియో యూపీలో సంచలనం సృష్టించింది. దీని ఆధారంగా యువతి తండ్రి స్వామి చిన్మయానంద్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే పోలీసులు మాత్రం మూడు రోజుల తర్వాత చిన్మయానంద్ మీద కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘యువతి తండ్రి ఫిర్యాదు మేరకు స్వామి చిన్మయానంద్ ఆశ్రయంలో సోదాలు చేశాం. ఆశ్రమంలో ఉన్న కొందరితో మాట్లాడాం. యువతిని క్షేమంగా ఇంటికి చేర్చడం మా ప్రథమ కర్తవ్యం. దాన్ని పూర్తి చేశాం. ఇక ఈ కేసులో తదుపరి విచారణను ప్రారంభిస్తాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment